సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్కు వెళ్లిన ముగ్గురిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయిన వాహన డ్రైవర్ను పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు.
వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన బొలెరో
సూర్యాపేట మండలం బాలెంల స్టేజి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న ముగ్గురిని బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గుర్రం సైదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
మరో బాధితుడు గొల్ల జానయ్యకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయిన బొలెరో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాకింగ్కు వెళ్లిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
also read: రణ్బీర్ కపూర్ చేతికి రూ.78 లక్షల వాచ్.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
