చిత్తూరు, క్రైమ్ మిర్రర్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన మృతి చెందడంతో ఆ ప్రాంత మంతా విషాదం అలుముకుంది. వివరాల ఇలా ఉన్నాయి. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు శేషాపురం వద్ద సర్వీస్ రోడ్డులో ఆగింది. అదే సమయంలో, బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి, కుమార్తె అద్వికగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుంచి ట్యాక్సీలో వస్తుండగా ఈ విషాదఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
