క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ఈ ఏడాది అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రకృతి సహకరించక, మరోవైపు మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోక.. అరిగోస పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు మొంథా తుఫాన్ తో కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యం తడిసిపోగా, ఇప్పటికే మాయిశ్చర్ వచ్చిన అన్నదాతల ధాన్యం కాంటాలు వేస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. ధాన్యం బస్తాలను మిల్లుల దగ్గరికి పంపిస్తున్నారు. కానీ, అక్కడే అసలు సమస్య ఎదురవుతోంది.
ధాన్యం దిగుమతిలో మిల్లర్ల అలసత్వం
మిల్లులకు వెళ్లిన ధాన్యాన్ని వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. రకరకాల కారణాలు చెప్తూ, ఒక్కో లారీలోని ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకునేందుకు రెండు, మూడు రోజులు సమయం తీసుకుంటున్నారు. మిల్లుల దగ్గర లారీలు బారులు కడుతున్నాయి. ఒక్కో ట్రిప్పుకు ఇంత సమయం పట్టడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని లారీల యజమానులు ధాన్యం తీసుకెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలోకాంటాలు చేసిన ధాన్యం పంపించేందుకు లారీలు లేక, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు ఒరుపు ఇచ్చినప్పుడే త్వరగా ధాన్యం కాంటాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా, మిల్లర్ల అలసత్వం కారణంగా లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
అన్నదాతల ఆవేదన
మొంథా తుఫాన్ తర్వాత మళ్లీ వర్షాలు మొదలైన నేపథ్యంలో తమ ధాన్యం ఎప్పుడు కాంటాలు అవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం వెంటనే మిల్లర్లతో మాట్లాడి మిల్లుల దగ్గరికి వచ్చిన లారీ వచ్చినట్లే ధాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
				
					
						




