
Fake certificate:- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల వ్యవహారం సంచలనంగా మారింది. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన ఈ పట్టణంలో మూతబడిన పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూల్స్‌లో చదవని వారికి కూడా కావాల్సిన స్టడీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ బదులుగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడ చదువుకున్నట్టుగా ధ్రువపత్రాలు ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అక్రమ లాభాలు కల్పిస్తున్నారని, దీనివల్ల స్థానిక నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇటీవల ఓ ప్రభుత్వ రంగ సంస్థలో సర్టిఫికెట్లపై అంతర్గతంగా చర్చ జరుగుతుండగా, వందల సంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు గోదావరిఖని నుంచే వస్తున్నాయన్న అనుమానం బలపడినట్లు సమాచారం. దీనితో ఈ దందా వెనుక పెద్ద స్థాయి నెట్‌వర్క్ పనిచేస్తోందన్న సందేహాలు పెరుగుతున్నాయి. అధికారుల సమాచారం మేరకు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక విచారణ చేపట్టగా, పలు సర్టిఫికెట్లలో అసమానతలు, రికార్డు లోపాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ సర్టిఫికెట్ల దందా వెలుగులోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు వేగం పెరిగితేనే నిజానిజాలు బయటపడతాయని, లేకపోతే యువత భవిష్యత్తు మరింత నష్టపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Read also : Donald Trump: యూరప్ లో ట్రంప్ కల్లోలం, ఫ్రాన్స్ కు 200% టారిఫ్స్ వార్నింగ్!
Read also : Supreme Court: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టొచ్చు, సుప్రీం కీలక వ్యాఖ్యలు!





