
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షాలపై కాంగ్రెస్ వ్యవహారశైలిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పక్కనపెట్టి ప్రభుత్వం రాజకీయాల్లో మునిగిపోయిందని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అప్పట్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించి వేగంగా పూర్తి చేశామని తెలిపారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయినా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఇంతవరకూ ఎందుకు ప్రజలకు నీళ్లు అందడం లేదని నిలదీశారు. ఇలాంటి అంశాలపై ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజల సమస్యలపై మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేశారు.
చెక్‌డ్యామ్‌ల వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను బాంబులతో పేల్చడం ఏ విధమైన పాలన అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు పాల్పడిన వారు పాతాళంలో దాక్కున్నా పట్టుకొస్తామని హెచ్చరించారు. తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష తప్పదని తేల్చిచెప్పారు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అని పేర్కొన్నారు. అధికార పార్టీపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ఎన్నికలే సమాధానం ఇచ్చాయని అన్నారు.
ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్ర మరింత బలంగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై మౌనంగా ఉండే ప్రశ్నే లేదని, ప్రతిపక్ష బాధ్యతను వంద శాతం నిర్వర్తించాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తమ కర్తవ్యమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని కేసీఆర్ తెలిపారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ విజయం వెనుక కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసం ఇంకా బీఆర్ఎస్ పైనే ఉందని ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు.
గర్వంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికార అహంకారం ప్రజలకు ఎంతగా నచ్చదో ఈ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి అహంకారపూరిత హింసా ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరును తీవ్రంగా తప్పుబట్టిన కేసీఆర్.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను గౌరవించడం పాలకుల బాధ్యత అని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలపై దమనకాండకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని హెచ్చరించారు.
ALSO READ: ఎదురింటి వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!





