ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

తిట్టుకున్నా, కొట్టుకున్నా విడాకులు లేవు - జనసేనతో దోస్తీపై లోకేష్‌ క్లారిటీ..!

టీడీపీ-జనసేన మధ్య విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. గ్రౌండ్‌ లెవల్‌లో సఖ్యత లేకపోయినా… పార్టీల పెద్దలు మాత్రం కలిసే ఉండాలి.. ఉండితీరాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధిష్టానం చెప్పాక కార్యకర్తలు మాత్రం ఏం చేయగలరు.. తల ఊపడం తప్ప. యలమంచిలి టీడీపీ క్యాడర్‌ పరిస్థితి కూడా ఇదే. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బాగానే ఉంది.. కానీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి…? వారికి తగిన న్యాయం జరగడం లేదు..? మీరే న్యాయం చేయాలని అంటూ లోకేష్‌ ముందు మొరపెట్టుకున్నారు. కానీ… లోకేష్‌ మాత్రం సమస్యలు ఉన్నా సర్దుకుపోవాలని.. కలిసే ముందుకు వెళ్లాలని హితబోధ చేశారు. దీంతో… కష్టాన్ని గొంతులో దిగమింగి… చెప్పిన దానికి తల ఊపడం.. యలమంచిలి టీడీపీ కేడర్‌ వంతైంది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి టీడీపీ నేతలు, కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో యలమంచిలి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు తన సమస్యను లోకేష్‌ ముందు ఉంచారు. పొత్తులో భాగంగా యలమంచిలి టికెట్ జనసేనకు ఇచ్చినా… 80 శాతం టీడీపీ కార్యకర్తలు ఉన్న దగ్గర.. ప్రాధాన్యత ఉండేలా చూడాలన్నారు. కూటమి ధర్మం పాటించేలా చేయాలని లోకేష్‌కు విన్నవించుకున్నారు. పనుల విషయంలో టీడీపీ కేడర్‌కు అన్యాయం జరుగుతోంది… ఆ విషయంలో దృష్టి పెట్టాలని కోరారు. దీనికి లోకేష్‌ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా… సమస్యలు ఉన్నా సర్దుకుపోవాలన్నారు. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయని.. అలాంటిది రెండు పార్టీలు కలిస్తే సమస్యలు ఉండవా అని ప్రశ్నించారు. సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తేనే… వైసీపీని మట్టికరిపించగలిగామని.. చెప్పకనే చెప్పారు లోకేష్‌. కనుక… జనసేనతో విభేదాలు ఉన్నా… కొట్టుకున్నా, తన్నుకున్నా విడాకులు మాత్రం ఉండవని తేల్చిచెప్పారాయన.

Also Read : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పై బెట్టింగులు…! 

ఇక.. టీడీపీలో అలక అనే జబ్బు ఉందని.. దానికి వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు. వేదికపైకి పిలవలేదనో, పనులు జరగలేదనో… ఏదో ఒక కారణంతో అలిగి ఇంట్లో కూర్చుంటున్నారని చెప్పారు. సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి గానీ… అలగకూడదన్నారు. పని జరగకపోతే… తననైనా నిలదీయొచ్చని చెప్పారు. ఇకపై ఎవరైనా అలిగితే.. కర్ర పట్టుకుని వస్తానన్నారు మంత్రి లోకేష్‌.

నామినేటెడ్‌ పదవుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారాయన. పనిచేస్తేనే పదవులు వస్తాయని.. కాగితాలు పట్టుకుని తన చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే పదవులు రావన్నారు. కష్టపడి పనిచేసేవారికి, ప్రజల్లో ఉండే కార్యకర్తలకే పదవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్‌గా ఉన్నారని కూడా చెప్పారు. పదవుల విషయంలో తాము పేర్లను మాత్రమే ప్రతిపాదించగలమని… వారి చరిత్రను ముఖ్యమంత్రి పరిశీలించి, పనితీరును బట్టే పదవులు ఇస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు

  2. 16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం

  3. వైఎస్‌ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు

  4. కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన జగన్‌

  5. టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

Back to top button