మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాష్ట్ర యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో నూతన స్వల్పకాలిక కోర్సులను మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎన్సీ మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2డీ మరియు 3డీ ప్రొడక్ట్ డిజైనింగ్ వంటి ఆధునిక కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు పేర్కొంటున్నాయని, అందుకే ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ సెట్స్‌పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఐటీఐల ద్వారా భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన నిపుణులను తయారు చేస్తున్నామని చెప్పారు.

ఏటీసీ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
నేటి పోటీ ప్రపంచంలో ఒకే నైపుణ్యం సరిపోదని, యువత మల్టీ స్కిల్డ్‌గా మారితేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని మంత్రి సూచించారు. ఏటీసీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు లభించేలా శిక్షణా విధానాన్ని రూపొందించాలని ఐటీఐ ప్రిన్సిపాల్స్‌కు సూచిస్తున్నామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉందని, అగ్రి అలైడ్ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అలాగే జీనోమ్ వ్యాలీ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక కోర్సులను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
విద్యార్థులు జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలని మంత్రి సూచించారు. టామ్‌కామ్ ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, ఇప్పటికే ఏటీసీల నుంచి పలువురు విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో జిల్లాల వారీగా జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, అధికారులు, ట్రైనర్లు , ఐటీఐ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
