
Election Promises: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ప్రజలు ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం మాట ఇచ్చి, తర్వాత ఆ మాటలు నిలబెట్టుకోకుండా మాయం అయ్యే నేతలు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ చెంజర్ల గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి మాత్రం పూర్తిగా భిన్నంగా ముందుకొచ్చారు. రాజేశ్వరి తన నియోజకవర్గ ప్రజల ముందుకు ఒక అద్భుతమైన ధైర్యంతో వచ్చి, తాను ఇచ్చే హామీలు ఒక పేపర్‌పై రాసి, వాటిని నిజాయితీతో నెరవేర్చుతానని స్పష్టంగా తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నానో, ఎలా చేయాలనుకుంటున్నానో అన్న వివరాలన్నీ రూ.100 విలువైన బాండ్ పేపర్‌పైనే రాసి ప్రజలకు అందించారు.
తాను చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోతే, గ్రామ ప్రజల ముందు తన మెడలో చెప్పును వేసుకుని రాజీనామా చేసి వెళ్ళిపోతానని రాజేశ్వరి ప్రకటించడం గ్రామంలో సంచలనం సృష్టించింది. సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది మరోటి అన్న అభిప్రాయాల మధ్య, ప్రజలను నమ్మేలా తన నిజాయితీని ఇలా బహిరంగా రుజువు చేయడం గ్రామ ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే.. తన ప్రత్యర్థులు డబ్బులు, మద్యం పంచి ఓట్లు అడగకుండా, తాను చెప్పినట్లే వారు కూడా మేనిఫెస్టో విడుదల చేసి, నిజాయితీతో ఓట్లు కోరాలని రాజేశ్వరి స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు ఇచ్చే ఒక్కో ఓటు విలువను కాపాడాలన్న ఉద్దేశంతో, ఎన్నికలను శుద్ధంగా నిర్వహించాలని ఆమె చేసిన పిలుపు గ్రామంలో మంచి సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది. రాజకీయాల్లో ఇలాంటి నిర్మలమైన వైఖరి అరుదైనదే కావడం వల్ల ప్రజలు ఆమె హామీలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.





