తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులతో పాటు మంత్రులు ఎవరికి తోచిన దారిలో వాళ్లు దోచుకుంటున్నారనే విమర్ళలు వస్తున్నాయి. ప్రతి పనిలోనూ కమీషన్ ఇవ్వనిదే ముందుకు సాగడం లేదని అంటున్నారు. తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
బిల్లులు విడుదల చేయడానికి ఓ మంత్రి భార్య ఇంట్లో దుకాణం ఓపెన్ చేసి 7 నుండి 10 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు ఎంపీ రాజేందర్. మళ్లీ వస్తామో రామో.. దొరుకుతాదో దొరకదో అన్న పద్దతిలో దోచుకుంటున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుండి 10 శాతం కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బైటకి రావడం లేదని ఆరోపించారు. ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణం ఓపెన్ చేశారని అన్నారు. నేను కూడా ఐదేండ్లు ఫైనాన్స్ మినిస్టర్‌గా చేశాను.. ఎప్పుడైనా విన్నారా ఇలా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా దందాలు తెరిచారన్నారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాన్నన్న ఈటల రాజేందర్.. గతంలో ఇప్పుడు ఇలాంటి లీడర్లను చూడలేదన్నారు. రేవంత్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి.