తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTRకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఈడీ. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు పంపించింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.
అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల విచారణ తర్వాత కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగిన అవకతవకలపై పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తోంది ఈడీ. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించింది ఈడీ.
FEOకు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ వెనుక ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఏసీబీ కూడా విచారణ జరుపుతోంది. ఇటీవలే హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో కేటీఆర్ కు త్వరలోనే ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. డిసెంబర్ 31 వరకు కేటీఆర్ ను విచారించవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జనవరిలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది.