
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది సమయానికి భోజనం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం విషయంలో నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, కుటుంబ బాధ్యతలు వంటి కారణాలతో చాలామంది అర్థరాత్రి దాటాకే భోజనం చేస్తున్నారు. అయితే ఈ అలవాటు శరీరంపై మెల్లగా కానీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మొదటగా ప్రభావితమయ్యేది జీర్ణక్రియ వ్యవస్థ. ఆ సమయంలో శరీరం విశ్రాంతి మూడ్‌లోకి వెళ్తుండగా, భారమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణం సరిగ్గా జరగదు. దీని ఫలితంగా అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. దీర్ఘకాలంగా ఇదే అలవాటు కొనసాగితే కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
నిపుణుల సూచనల ప్రకారం.. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యుత్తమం. ఈ సమయంలో భోజనం చేస్తే జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు గంటల విరామం నిద్రకు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మరో పెద్ద ప్రమాదకర అలవాటు. ఇలా చేయడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. దీని వల్ల రాత్రంతా అసౌకర్యం, నిద్రలో అంతరాయం కలగడమే కాకుండా మరుసటి రోజు అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్ర నాణ్యత తగ్గిపోవడం మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది.
ఆలస్యంగా భోజనం చేసే అలవాటు బరువు పెరుగుదలకు కూడా కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో శరీరం కేలరీలను వేగంగా ఖర్చు చేయలేకపోతుంది. అలా తీసుకున్న అదనపు కేలరీలు కొవ్వుగా మారి శరీరంలో నిల్వ అవుతాయి. దీని వల్ల ఊబకాయం, షుగర్, బీపీ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో రాత్రి భోజనం చేయడం వల్ల నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరిగితే శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా గాఢమైన నిద్ర లభిస్తుంది. ఇది మరుసటి రోజు శరీర చురుకుదనం, మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. రోజువారీ పనుల్లో దృష్టి కేంద్రీకరణ కూడా మెరుగవుతుంది.
రాత్రి భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎక్కువ మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించి, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అసిడిటీ, గ్యాస్, ఛాతి మంట వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే రాత్రి భోజనం సమయం ఒక చిన్న అలవాట్లా కనిపించినా, దాని ప్రభావం మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పు చేస్తే దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సమయానికి భోజనం చేయడం ద్వారా శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ALSO READ: ప్రియుడితో నవ వధువు రొమాన్స్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త





