
కోదాడ,క్రైమ్ మిర్రర్:- కోదాడ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, అక్రమ రవాణాపై విషయాలు పై జిల్లా ఎస్పీ ఆదేశాల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుండి అనుమతి లేకుండా ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆరు ప్రధాన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల వద్ద 24 గంటలపాటు పోలీస్ సిబ్బంది నిఘా కొనసాగిస్తూ, అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు.అనుమతి లేకుండా లేదా సరైన పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ధాన్యం రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఏడు లారీలు, ఒక ట్రాక్టర్‌పై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. సివిల్ సప్లయ్స్ శాఖతో దగ్గరగా సమన్వయం చేస్తూ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్టు చెప్పారు. మరెవరు అనుమతి లేకుండా ధాన్యం రవాణా చేస్తే క్షమించేది లేదని, వెంటనే కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
Read also : హిడ్మా ఎన్‌కౌంటర్ అంత బూటకం…!
ఇక ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన డీఎస్పీ, సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న రెండు, మూడు విడతల గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. కోదాడ నియోజకవర్గం మొత్తం 120గ్రామపంచాయతీలను పరిశీలించగా, వీటిలో 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి, అదనపు బలగాలను మోహరింపజేసి, నిఘాను పెంచినట్టు అన్నారు.ప్రజల్లో ఎన్నికలపై, శాంతిభద్రతలపై అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపట్టిందని చెప్పారు. పోలీసుల కళాజాత బృందం గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టపరమైన అవగాహన, ఎన్నికల నిబంధనలు, అక్రమ రవాణాపై శిక్షలు వంటి అంశాలపై చైతన్యం కల్పిస్తున్నట్టు వివరించారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలపడతాయని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.జిల్లాలో నేర చర్యలను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, ఎలాంటి ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పహారా బృందాలు, మొబైల్ పార్టీలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఎన్నికల కాలంలో గానీ, సాధారణ రోజుల్లో గానీ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి డీఎస్పీ స్పష్టం చేశారు.
Read also : డిప్యూటీ సీఎం దిష్టి వివాదాన్ని ఇంతటితో ఆపేయండి : మంత్రి దుర్గేష్





