Driving Licence Cancellation: రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది. తరచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లు ఇక ఎంతమాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు. చిన్న తప్పయినా ఏడాదిలో ఐదుసార్లు జరిగితే మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ నిలిపివేస్తారు. ప్రాంతీయ రవాణా, జిల్లా రవాణా అధికారికి సదరు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కొత్తచట్టం ప్రకారం అధికారం ఉంటుంది.
జనవరి 1 నుంచే కొత్త నిబంధన అమలు
జనవరి 1 నుంచి నిశ్శబ్దంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చేసింది. గతంలో శిక్షార్హమైన పెద్ద నేరాలకు మాత్రమే.. వాహన దొంగతనం, ప్రయాణికులపై దాడి, కిడ్నాప్, అధిక వేగం, ఓవర్ లోడ్, బహిరంగ ప్రదేశాల్లో వాహనాన్ని వదిలేయడం వంటి వాటికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి శిక్ష ఉండేది.
సిగ్నల్ దాటినా, హెల్మెట్ లేకపోయినా
తాజా చట్ట సవరణతో హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, రెడ్ లైట్‌ను పట్టించుకోకుండా కదలడం వంటి తప్పులకు కూడా లైసెన్స్ రద్దు చేయవచ్చు. కేంద్ర మోటారు వాహన నిబంధనలు రెండవ సవరణ, 2026 ప్రకారం టోల్ ఫీజు బకాయి ఉంటే ఆ వాహనం అమ్మకానికి, అంతర్రాష్ట్ర బదిలీకి ఎన్‌వోసీ జారీ చేయరు.





