
టెక్నాలజీ వేగం పెరిగిన ఈ కాలంలో సెల్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ఉద్యోగ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు అనే తేడా లేకుండా ఉదయం నిద్రలేవగానే మొదలుకుని రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ గడిపే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ప్రతి అంశం మనల్ని ఫోన్‌కు మరింత దగ్గర చేస్తుండటంతో తెలియకుండానే అది ఒక వ్యసనంలా మారుతోంది. దీని ప్రభావం శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ప్రశాంతతపైనా తీవ్రంగా పడుతోంది. కళ్ల సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ శబ్దం నుంచి కొంత విరామం తీసుకుని జీవితం నెమ్మదిగా సాగించాలన్న ఆలోచనతో ‘స్లో లివింగ్’ అనే కొత్త జీవనశైలి ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
స్లో లివింగ్ అంటే పనులను వదిలేసి ఖాళీగా ఉండటం కాదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, తొందరపాటు లేకుండా, పూర్తి ఏకాగ్రతతో జీవించడం దీని అసలు ఉద్దేశం. ముఖ్యంగా వీకెండ్స్‌లో లేదా వారంలో కనీసం ఒకరోజైనా ఫోన్, ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరంగా ఉండడం ఈ జీవనశైలిలో కీలక అంశంగా మారింది. దీనినే ‘డిజిటల్ డిటాక్స్’గా పేర్కొంటున్నారు. జపాన్‌లో ప్రారంభమైన ‘ఫారెస్ట్ బాతింగ్’ భావన కూడా ఇదే కోవలోకి వస్తుంది. ప్రకృతి ఒడిలో, అడవుల్లో, మొబైల్ ఫోన్ వంటి డిజిటల్ పరికరాల జోక్యం లేకుండా కొంత సమయం గడపడం ద్వారా మనసు, శరీరం రెండూ ప్రశాంతతను పొందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు, యువతలో వేగంగా విస్తరిస్తోంది.
వారంలో ఒక్కరోజు అయినా ఫోన్‌ను పక్కన పెట్టడం వల్ల శరీరంలో, మనసులో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిరంతరం నోటిఫికేషన్లు, సమాచారం భారంతో అలసిపోయిన మెదడుకు ఇది ఒక రీసెట్‌లా పనిచేస్తుంది. ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి, ఏకాగ్రత సామర్థ్యం మెరుగవుతుంది. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. కాబట్టి డిజిటల్ డిటాక్స్ పాటిస్తే నిద్ర నాణ్యత మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫోన్ స్క్రీన్‌లలో మునిగిపోకుండా కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడటం వల్ల సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
డిజిటల్ డిటాక్స్ సమయంలో ఖాళీగా ఉండటం కంటే మనకు ఇష్టమైన పనులపై దృష్టి పెట్టడం మరింత లాభదాయకం. పాత కాలపు చేతివృత్తులు నేర్చుకోవడం, తోటపని చేయడం, వంట చేయడం వంటి సాధారణ పనులు కూడా మానసిక ఆనందాన్ని ఇస్తాయి. మట్టితో పని చేయడం, మొక్కలను సంరక్షించడం వల్ల శరీరంలో డోపమైన్ వంటి ఆనంద హార్మోన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది యువత ప్రతి ఆదివారం ఫోన్‌కు దూరంగా ఉండే అలవాటును పెంచుకుంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయాలే కానీ మనల్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదన్న ఆలోచన బలపడుతోంది. ఇతరుల జీవితాలను సోషల్ మీడియాలో చూస్తూ సమయం వృథా చేయడం కంటే, స్వీయ అభివృద్ధికి కేటాయించాలన్న భావనకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. వారంలో ఒక రోజు ‘డిజిటల్ ఫాస్టింగ్’ పాటిస్తే మనలోనే కొత్త ప్రశాంతత, సంతృప్తి అనుభూతి కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ALSO READ: మున్సిపల్ ప్రచారం.. హరీష్ రావు, బీజేపీ, ఎంఐఎంపై కాంగ్రెస్ ఫిర్యాదు





