Fertilizer Booking App: రైతు కష్టాన్ని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్.. ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీలో మరింత పారదర్శకత పెరగడంతో పాటు.. రైతులకు సమయం, శ్రమ, రెండూ ఆదా కానున్నాయని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రంలో రైతు యూరియా బుకింగ్ యాప్‌ను , జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు యాప్ వినియోగంపై ముఖ్యమైన సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రోమోర్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అన్నదాతలు పాల్గొన్నారు.
యూరియా కొరతకు చెక్ పెట్టేలా!
వానాకాలంలో రైతులకు యూరియా సరిపడా దొరకకపోవడంతో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో యూరికా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. సరిపడా యూరియా లభించే విధంగా కొత్తగా బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం పత్తిపంటలను సాగు చేసిన అన్నదాతలు దాన్ని విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్‌ను స్లాట్ బుక్ చేసుకున్నట్లుగానే, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియాను ముందస్తుగా ఆ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
విడతల వారీగా యూరియా సరఫరా
రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా.. పలు విడతల వారిగా సరఫరా చేయనున్నారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, ఐదు నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతన్నలకు మూడువిడతల్లో, 20 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకుని యూరియాను తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
యాప్ లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించే యాప్ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా, రైతులు పట్టాదారు పాసు పుస్తకంతో లింకై ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా యాప్ లోకి లాగిన్ కావాలి. ఫర్టిలైజర్ యాప్‌లో రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్‌ను నమోదు చేయగానే.. లింకైన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి తమ ప్రాంతంలోని డీలర్ల స్టాక్ సమాచారాన్ని చూడవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎంత యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత, కావాల్సిన డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ చేయవచ్చు. పంట రకం, సాగు భూమి విస్తీర్ణం వంటి వివరాలు ఇవ్వాలి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా అవసరమైన యూరియా మొత్తాన్ని లెక్కించి చూపిస్తుంది. బుకింగ్ పూర్తి కాగానే, ఒక ప్రత్యేక ఐడీ మీ ఫోన్‌కు వస్తుంది. డీలర్ వద్దకు వెళ్లి ఆ ఐడీ చూపిస్తే, క్యూలో వేచి ఉండకుండానే ఎరువులు తీసుకోవచ్చు. ఈ విధానం పారదర్శకతను పెంచుతుంది. కృత్రిమ కొరతలు సృష్టించే అవకాశాలు తగ్గుతాయి. సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులు కేటాయించడం వల్ల, నిజమైన రైతులకే లాభం చేకూరుతుంది.
ఈ యాప్ తో లాభం ఏంటంటే?
యాప్ ద్వారా యూరియా బుకింగ్ వల్ల సమయం ఆదా అవుతుంది. గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అందరూ సమానంగా యాక్సెస్ పొందుతారు. కౌలు రైతులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు, కానీ భూమి యజమాని ఆధార్ ధృవీకరణ అవసరం. స్మార్ట్ ఫోన్ లేని వారు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి సహాయం తీసుకోవచ్చు. పట్టాదార్ పాస్‌బుక్ లేకపోయినా, ఆధార్ కార్డు సరిపోతుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ గడువు తేదీలోగా యూరియా తీసుకోనట్లైతే అది తిరిగి స్టాక్‌లోకి వెళ్తుంది.





