
సుగుణమ్మ.. టీడీపీ సీనియర్ నేత. అయినా… పార్టీ ఆమెకు తగిన గౌరవం ఇవ్వడంలేదన్న వాదన వినిపిస్తోంది. ఏదో ఇచ్చామంటే… ఇచ్చాం అన్నట్టు… పదవి కేటాయించారే తప్ప… ఆమెకు తగిన పదవి కాదని… జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలంకారప్రాయమైన పదవి అప్పగించి… సీనియర్ నేతను అవమానిస్తున్నారని సుగుణమ్మ అనుచరులు రగిలిపోతున్నారు.
అసలు ఏం జరిగిందంటే… కూటమి ప్రభుత్వం మరోసారి కొన్ని నామిటేడ్ పదవులు భర్తీ చేసింది. అందులో సుగుణమ్మకు కూడా ఒక పదవి ఇచ్చింది. రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమె స్థాయికి, అనుభవానికి అది తగిన పదవి కాదని అంటున్నారు సుగుణమ్మ అనుచరులు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు సుగుణమ్మ. కాని.. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ఆ టికెట్ జనసేనకు వెళ్లిపోయింది. ఆ సమయంలో సుగుణమ్మ కాస్త అలిగినా.. టీడీపీ అధిష్టానం బుజ్జగించడంతో… ఆమె ఒప్పుకున్నారు. అభ్యర్థి గెలుపునకు కృషిచేసారు. ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి గెలిచినా… సుగుణమ్మ వర్గానికి దరిచేరనివ్వడంలేదు. జిల్లాలో పరిస్థితి అలా ఉంటే… ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ కూడా అన్యాయం చేసిందని సుగుణమ్మ వర్గం మండిపడుతోంది.
ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా… తుడా లేదా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇస్తారని సుగుణమ్మ ఆశపడ్డారు. కానీ… ఇప్పుడు ఎవరికీ తెలియని రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి అంటగట్టారని ఆమె రగిలిపోతున్నారు. ఈ పదవి ఇవ్వడం అంటే… సుగుణమ్మను అవమానించడమే అని ఆమె వర్గీయులు విమర్శిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన ఆమెకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ప్రశ్నిస్తున్నారు. ఆ పదవిని తీసుకోకుండా.. తిరస్కరించడమే ఉత్తమమని ఆమె శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు.