తెలంగాణ

ఎమ్మెల్యే, ఎంపీ మధ్య డైలాగ్‌ వార్‌ – దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు… వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీ. ఇప్పుడు ఒకరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఇంకొకరు బీజేపీ ఎంపీ. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొన్నేళ్లుగా సాగుతోంది. ఇప్పుడు ఆ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నువ్వా-నేనా అనుకునే వరకు వచ్చాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం… దుబ్బాకలో రాజకీయ వేడి రాజేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ ఏ రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు.

దుబ్బాక అభివృద్ధిని గతంలో ఎవరూ పట్టించుకోలేదని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి పెద్దగా నిధులు రాలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పనులు మంజూరు చేయించుకున్నట్టు చెప్పారాయన. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ చేసిన ఈ కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌రెడ్డి భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో దుబ్బాక అభివృద్ధి పట్టించుకోలేదని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నానని అన్నారు రఘునందన్‌రెడ్డి. తాను చెప్పినప్పుడు.. అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అది నిజం కాదని వాదించారన్నారు. కానీ.. ఇప్పుడు ఆయన వాస్తవాన్ని అంగీకరించారని… తాను చెప్పిందే నిజమని ఒప్పుకున్నారని అన్నారు. తాను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్పప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చేవారు కాదన్నారు. నియోజకవర్గ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి బీఆర్ఎస్‌ హయంలో ఉండేదన్నారు. కానీ.. ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి.. సీఎంలు, మంత్రులను చాలా సులువుగా కలుస్తున్నారని ఎద్దేవా చేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు… ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే ఉండేవారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత రఘునందన్‌రావు బీజేపీలో చేరారు.
సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం… ఈ ఇద్దరు నేతల మధ్య వైరానికి కారణమైంది. 2020లో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత… దుబ్బాకకు ఉపఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలో నిలబెట్టింది. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేశారు. సుజాతపై వెయ్యి ఓట్ల తేడాతో గెలిచారు రఘునందన్‌రావు. ఆ సమయంలో మెదక్‌ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అయితే.. రఘునందన్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి సొంత గ్రామం దుబ్బాకే. దీంతో.. దుబ్బాక విషయంలో ఇద్దరి మధ్య రాజకీయం వైరం నువ్వా-నేనా అన్నట్టు సాగుతోంది. రఘునందన్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ పట్టించుకోవడంలేదని.. నిధులు విడుదల చేయడంలేదని విమర్శించారు. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. 2023 ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు-కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీ పడ్డారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలవడంతో… ఎంపీ పదవికి రాజీనామా చేసి దుబ్బాక ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్‌రావు… మెదక్‌ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో… వీరిద్దరి పదవులు అటు, ఇటు అయ్యాయి. కానీ.. వీరి మధ్య పొలిటికల్‌ వార్‌ మాత్రం… పెరుగుతూనే ఉంది.

ఇంటెలిజెంట్ గా వ్యవహరించిన బీసీసీఐ!.. మరి ఐపీఎల్ పరిస్థితి ఏంటి?

పాకిస్తాన్‌తో యుద్ధం – డేంజర్‌ జోన్‌లో విశాఖ- హైదరాబాద్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఎంత…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button