Homeజాతీయంవిమాన ప్రయాణికుల కోసం DGCA కఠిన నిబంధనలు

విమాన ప్రయాణికుల కోసం DGCA కఠిన నిబంధనలు

విమాన ప్రయాణాల్లో క్రమశిక్షణ, భద్రతకు భంగం కలిగించే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA (Directorate General of Civil Aviation) కఠిన చర్యలకు సిద్ధమైంది. తోటి ప్రయాణీకులు లేదా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఇకపై రాజీ లేని వైఖరిని అవలంబించనున్నట్లు స్పష్టంచేసింది. విమాన ప్రయాణంలో శాంతి, భద్రతను కాపాడటమే లక్ష్యంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేసేందుకు కొత్త ముసాయిదా నిబంధనలను సిద్ధం చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే విమానాల్లో అనుచిత ప్రవర్తనకు కఠిన శిక్షలు తప్పవని సంకేతాలు ఇస్తున్నాయి.

ఇప్పటివరకు విమానంలో జరిగిన సంఘటనలకే పరిమితమైన పర్యవేక్షణను విస్తరించనున్నారు. చెక్ ఇన్ కౌంటర్లు, లాంజ్‌లు, బోర్డింగ్ గేట్ల వద్ద కూడా ప్రయాణీకుల ప్రవర్తనను గమనించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎవరైనా అక్కడే అసభ్యంగా లేదా క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారికి విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు ఉంటుంది. జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ DGCA సంబంధిత సంస్థలకు అందజేయనుంది. అలాంటి వారిని నేరుగా నో ఫ్లై జాబితాలో చేర్చి విమాన ప్రయాణాలపై నిషేధం విధించనున్నారు.

ప్రయాణీకుల అనుచిత ప్రవర్తనను తీవ్రత ఆధారంగా 4 స్థాయిలుగా విభజించారు. లెవల్ 1 కింద మాటలతో దూషించడం, అసభ్య హావభావాలు చేయడం వంటి చర్యలు వస్తాయి. లెవల్ 2, లెవల్ 3 కింద శారీరక లేదా లైంగిక దాడులు, ఇతరులకు ప్రాణాపాయం కలిగించే చర్యలు పరిగణించబడతాయి. అత్యంత తీవ్రమైన లెవల్ 4 కింద ఫ్లైట్ క్రూ కాక్‌పిట్‌లోకి చొరబడే ప్రయత్నం చేయడం వంటి నేరాలు వస్తాయి. గతంలో ఇలాంటి ఘటనలపై శిక్ష విధించాలంటే స్వతంత్ర దర్యాప్తు కమిటీ నిర్ధారణ అవసరమయ్యేది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణీకులపై ఎయిర్‌లైన్స్ సంస్థలు నేరుగా చర్యలు తీసుకునే అధికారం పొందనున్నాయి.

ఇకపై ప్రయాణీకుల అసహనాన్ని ముందుగానే గుర్తించి పరిస్థితి తీవ్రతరం కాకుండా చూసే బాధ్యతను కూడా సిబ్బందిపై ఉంచారు. అదే సమయంలో సిబ్బంది కూడా ప్రయాణీకులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కేవలం భారతీయ విమాన సంస్థలకు మాత్రమే కాకుండా భారతదేశం నుంచి బయలుదేరే లేదా భారతదేశానికి వచ్చే విదేశీ విమాన సంస్థలకు కూడా వర్తించనున్నాయి. ప్రయాణీకుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యమని, కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డీజీసీఏ చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ తెలిపారు. విమాన ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా మార్చే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.

ALSO READ: రేపు ఢిల్లీలో మీటింగ్.. మంత్రులకు కొత్త టెన్షన్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

Most Popular

Recent Comments