
Maharashtra SC Certificate News: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మతం మారిన వారికి ఎస్సీ సర్టిఫికేట్లు రద్దు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మతం మారి ఎస్సీ సర్టిఫికేట్ తో ఉద్యోగాలు పొందిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.
మతం మారి ఎస్సీ సర్టిఫికేట్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
హిందు, బౌద్ధ, సిక్కు మతాల వారు కాకుండా ఇతరులు ఎస్సీ ధ్రువపత్రాలను పొంది ఉంటే వాటన్నింటినీ రద్దు చేస్తామన్నారు సీఎం ఫడ్నవీస్. ఇతర మతాల వారు తప్పుడు మార్గాల్లో ఎస్సీ సర్టిఫికెట్లను సమర్పించి, ఉద్యోగాలు పొంది ఉంటే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు, మతం మారి ఎస్సీ సర్టిఫికేట్ తో ఎన్నికల్లో విజయం సాధించి ఉంటే ఆ ఎన్నికను కూడా రద్దు చేయిస్తామని చెప్పారు.
శాసనమండలి వేదికగా కీలక ప్రకటన
మహారాష్ట్ర శాసన మండలిలో బీజేపీ సభ్యుడు అమిత్ గోర్ఖే ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై సీఎం ఫడ్నవీస్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా.. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారికే ఎస్సీ సర్టిఫికెట్లు వర్తిస్తాయని చెప్పారు. తప్పుడు సర్టిఫికెట్ తో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందితే ఆ సొమ్మును వసూలు చేస్తామని సీఎం హెచ్చరించారు.