
కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి రాగానే కొనుగోలు చేయాలనే ఉత్సాహం చాలా మందిలో కనిపిస్తుంది. ముందస్తు బుకింగ్‌లు చేసుకుని మరీ లేటెస్ట్ కారును ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తుంటారు. అయితే ఆటోమొబైల్ రంగ నిపుణులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. కారు కొనాలనుకునే వారికి సంవత్సరంలో బెస్ట్ టైమ్ డిసెంబర్ నెల అని స్పష్టం చేస్తున్నారు. అందుకే చాలా మంది వినియోగదారులు డిసెంబర్ 31 వరకు వేచి చూసి మరీ కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
డిసెంబర్ నెలలో కార్ల ధరలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనసులు లభిస్తాయి. దీని వెనుక అనేక వ్యాపార కారణాలు ఉన్నాయి. ఆటో కంపెనీలు, డీలర్లు ఈ నెలను ఇయర్ ఎండ్ సేల్స్‌కు కీలకంగా భావిస్తారు. కొత్త సంవత్సరంలో కొత్త మోడల్స్ మార్కెట్లోకి రానుండటంతో, పాత స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయాలనే లక్ష్యంతో డిసెంబర్‌లో భారీ ఆఫర్లకు తెరలేపుతారు.
ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్ డిసెంబర్ నెలలో కార్లు కొనడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. డీలర్ల వద్ద నిల్వ ఉన్న పాత మోడల్స్‌ను నిల్వ ఉంచడం వల్ల ఇన్వెంటరీ హోల్డింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి డీలర్లు ధరలను గణనీయంగా తగ్గించి వినియోగదారులను ఆకర్షిస్తారు. ఫలితంగా కొనుగోలుదారులకు లక్షల రూపాయల మేర లాభం చేకూరుతుంది.
మోడల్ ఇయర్ మార్పు కూడా డిసెంబర్‌లో కొనుగోలు చేయడాన్ని ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ 2025లో కొనుగోలు చేసిన కారు అదే ఏడాది మోడల్ ఇయర్‌గా రిజిస్టర్ అవుతుంది. జనవరి 2026లో అదే కారు 2026 మోడల్ ఇయర్‌గా పరిగణించబడుతుంది. దీని వల్ల రీసేల్ వాల్యూ పరంగా జనవరి మోడల్‌కు కొంత లాభం ఉంటుంది. అయితే డిసెంబర్‌లో పాత మోడల్స్‌పై లభించే 20 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్లు మొత్తం ఖర్చును భారీగా తగ్గిస్తాయి. దీంతో కొంత డిప్రిషియేషన్ ఉన్నప్పటికీ, మొత్తం పెట్టుబడిలో వినియోగదారుడికి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
డిసెంబర్ నెలలో సేల్స్ టార్గెట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ఏడాది ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయించుకున్న అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి చివరి నెలలో భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్సెసరీస్ వంటి ప్రయోజనాలు అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో కార్ ఇన్సూరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఖర్చుల్లో కూడా రాయితీలు ఇస్తారు.
ఫెస్టివ్ సీజన్ అనంతరం వచ్చే డిసెంబర్ ఇయర్ ఎండ్ సేల్స్‌కు మంచి అవకాశంగా మారుతుంది. భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ మార్చి చివర్లో ముగియడంతో, మార్చి కూడా కార్లు కొనడానికి అనుకూల సమయంగా చెప్పుకుంటారు. కానీ డిసెంబర్‌లో లభించే ఇయర్ ఎండ్ డీల్స్, స్టాక్ క్లియరెన్స్ ఆఫర్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
2025 డిసెంబర్ మరింత ప్రత్యేకమని ఆటో రంగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది GST తగ్గింపులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో డిస్కౌంట్లు గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రీమియం కార్ మోడల్స్‌పై ఏకంగా రూ. 10 లక్షల వరకు డిస్కౌంట్లు అందుతున్నాయి. దీంతో మధ్యతరగతి వినియోగదారులతో పాటు హైఎండ్ కార్లు కొనాలనుకునే వారు కూడా డిసెంబర్‌పై దృష్టి పెట్టారు.
అయితే డిసెంబర్‌లో స్టాక్ పరిమితంగా ఉండటం మరో కీలక అంశం. ఎక్కువ డిమాండ్ కారణంగా కొన్ని మోడల్స్, కలర్స్ త్వరగా అయిపోయే అవకాశముంది. కాబట్టి ముందుగానే సమీప డీలర్‌ను సంప్రదించి అందుబాటులో ఉన్న ఆఫర్లు, స్టాక్ వివరాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రీసేల్ వాల్యూ ముఖ్యమైతే జనవరి వరకు వేచి ఉండవచ్చని, కానీ తక్కువ ధరకు కారు కావాలంటే డిసెంబర్ ఉత్తమ ఎంపిక అని స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: యువకుడితో అక్కాచెల్లెళ్లకు అక్రమ సంబంధం.. ఆపై షాకింగ్ ఘటన





