
తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ప్రచారం సాగుతోంది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 15 శాతం అంటే 17 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో 14 మంది మంత్రులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణం చేయగా.. ఇటీవలే ముగ్గురిని తీసుకున్నారు. మరో మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే మిగిలిన మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్ చేస్తుందని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంత్రివర్గ విస్తరణపై సీఎంకు దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది. ఆ మూడు మంత్రి పదవులను వీలైనంతా త్వరగా భర్తీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలోనూ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు.
ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి చోటు దక్కలేదు. ఈ సారి ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని హైకమాండ్ సూచించిందని తెలుస్తోంది. ఇక్కడే మరో ట్విస్ట్ బయటికి వస్తోంది. మంత్రిపదవి రేసులోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారని సమాచారం. తనకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్‌ను కోరేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ.. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో ఉండగానే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం చర్చగా మారింది. సీఎం రేవంత్ పిలుపుతోనే దానం దేశ రాజధానికి వెళ్లారని అంటున్నారు. దానంను కేబినెట్ లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికల జరగనుంది. ఇది కాంగ్రెస్ సర్కార్ కు సవాల్ గా మారింది. జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి…కొత్త ప్లాన్ చేశారని అంటున్నారు. దానంను మంత్రివర్గంలోకి తీసుకుని.. జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. తనకు మంత్రిపదవి ఇస్తే జూబ్లీహిల్స్ లో గెలిపించి తీరుతానని దానం నాగేందర్ చెబుతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జూబ్లిహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. గతంలో ఆయన జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ పీజేఆర్ తనయుడు జూబ్లిహిల్స్ కోరుకోవడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్‌లో ఆయను భారీగా అనుచరులు నడుపుతున్నారు. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రి పదవి కోసం అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ బైపోల్ గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు.. బీఆర్ఎస్ పని అయిపోయిందని తేల్చేలా ఉపఎన్నిక ఫలితాన్ని సాధించాల్సి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎలాంటి చాయిస్ తీసుకునే చాన్స్ లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా జూబ్లిహిల్స్ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలిచి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ను ఆదేశించినట్టు తెలుస్తోంది.
జూబ్లిహిల్ బాధ్యతను దానం నాగేందర్‌కు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన తనదైన మార్క్ చూపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆయనకు ముస్లిం వర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. జూబ్లీహిల్స్‌లో అభ్యర్ధి గెలుపు, ఓటములను ముస్లిం ఓటర్లే డిసైడ్ చేస్తారు. అందుకే వారిని మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.