
Cruel: కలికాలం నిజంగా పరాకాష్టకు చేరిందని మరోసారి రుజువైంది. ఆస్తి, డబ్బు, ప్రయోజనాల కోసం కన్నవారినే మరిచిపోయే స్థాయికి మనుషులు దిగజారుతున్నారన్న చేదు నిజాన్ని బయటపెట్టిన భయానక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బీమా డబ్బు, ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇద్దరు కొడుకులు కలిసి తమ కన్నతండ్రినే పాముతో కరిపించి అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోతత్తూర్‌పేట ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తోంది.
పోతత్తూర్‌పేటకు చెందిన గణేషన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అక్టోబర్ 22న ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. శరీరంపై పాము కాటు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు మొదట దీనిని సాధారణ ప్రమాద మరణంగా భావించి కేసు నమోదు చేశారు. అయితే ఈ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం క్రమంగా బయటపడింది.
గణేషన్ పేరు మీద సుమారు రూ.3 కోట్ల విలువైన బీమా పాలసీలు ఉండటం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆయన మృతి అనంతరం ఆ బీమా సొమ్ము పొందేందుకు కుటుంబ సభ్యులు బీమా కంపెనీని సంప్రదించారు. క్లెయిమ్ పరిశీలనకు వచ్చిన బీమా అధికారులకు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాధానాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. ఒకరికి ఒకరు చెప్పిన మాటలు పొంతన లేకుండా ఉండటంతో అధికారులకు అనుమానం కలిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దిశ మారింది.
ఐజీ అస్రా గార్గ్ పర్యవేక్షణలో పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలు, కాల్ డేటా, కుటుంబ సభ్యుల కదలికలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గణేషన్ మరణం ప్రమాదం కాదని, పక్కా ప్లాన్‌తో చేసిన హత్యేనని పోలీసులు నిర్ధారించారు.
గణేషన్ కుమారులు మోహన్‌రాజ్, హరిహరన్ తమ తండ్రి చనిపోతే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ బీమా సొమ్ము తమకు వస్తుందనే ఆశతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు భయంకరమైన ప్లాన్ రచించారు. పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి అత్యంత విషపూరితమైన పామును డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 21న అర్ధరాత్రి తండ్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో తమ స్నేహితుల సహాయంతో ఆ పామును ఆయన మెడపై వదిలారు. పాము కాటుకు గణేషన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తండ్రి మృతి అనంతరం పాము కాటుతో సహజంగా చనిపోయినట్లు చూపించేందుకు కుమారులు నాటకం ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బీమా క్లెయిమ్ విచారణే వారి పాపాన్ని బయటపెట్టింది. ఈ దారుణ ఘటనలో కుమారులతో పాటు వారి స్నేహితులు బాలాజీ, ప్రశాంత్, నవీన్ కుమార్, దినకరన్ కూడా సహకరించినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు.
దీంతో గణేషన్ ఇద్దరు కుమారులు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కష్టపడి చదివించి, జీవితంలో స్థిరపడేలా చేసిన తండ్రినే డబ్బు కోసం ఈ స్థాయిలో హత్య చేయడం చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రేమ, త్యాగాన్ని మరిచి ఇలా మృగాల్లా మారడం సమాజానికి పెద్ద హెచ్చరికగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ALSO READ: Trending: భార్యకు 37 ఏళ్లు.. 87 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు!





