
అతడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా వాళ్ల కంటపడకూడదు అనుకున్నాడు. ఏకంగా తన వేషం మార్చుకున్ననాడు. చీర కట్టుకుని బయట తిరగడం మొదలుపెట్టాడు. కానీ, పాపం పండింది. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
13 క్రిమినల్ కేసులు నమోదు
రాజస్థాన్ కు చెందిన దయా శంకర్ మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు సహా పలు కేసులు నమోదయ్యాయి. అక్కడి పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు. పోలీసులు అతడిని పట్టుకుని లోపల వేయాలని ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి దయా కనిపించకుండాపోయాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. మగవాడిలా కాకుండా మహిళా చీర కట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు. చీరలో ఉంటే తనను ఎవరూ పట్టించుకోరు అనుకున్నాడు. పోలీసుల ముందే దర్జాగా చీరలో తిరగడం మొదలు పెట్టాడు.
విషయం పోలీసులకు తెలియడంతో..
దయా చీర కథ ఎలాగోలా పోలీసులకు తెలిసిపోయింది. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. చివరకు జోథ్ పూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చీరలో ఉన్న తనను లాక్కెళ్లి సెల్ లో పడేశారు. ప్రస్తుతం దయా అరెస్ట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మ దొంగా.. భలే వేషం వేశావే అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై దయా గ్యాంగ్ దాడి చేసింది. అతడిని కర్రలు, క్రికెట్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. దెబ్బల నుంచి కోలుకున్నాక ప్రిన్స్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అతడు పోలీసులకు దొరకుండా మారు వేషంలో తిరగడం మొదలుపెట్టాడు. చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: రఘువంశీపై మంత్ర ప్రయోగం, హనీమూన్ మర్డర్ కేసులో న్యూ ట్విస్ట్!