
crime: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుగా నిలుస్తారనే అనుమానంతో ఓ కూతురు తన తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూది మందు ఇస్తున్నానని నమ్మించి, విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను చంపినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
ఈ ఘటనలో మృతులుగా దశరథ్, లక్ష్మి దంపతులు గుర్తించారు. వీరికి ఒక కుమారుడు అశోక్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం సాధారణ జీవితం గడుపుతుండగా, చిన్న కూతురు సురేఖ చర్యలతో ఆ ఇంట్లో తీరని విషాదం అలముకుంది. సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.
అయితే ఆ ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయం సురేఖను వెంటాడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఆమెకు పెళ్లి చూపుల ఏర్పాట్లు జరుగుతుండటంతో, తన ప్రేమ పెళ్లికి అడ్డంకులు తప్పవనే భావన బలపడింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను తొలగిస్తే తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అమానుష ఆలోచనకు సురేఖ వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
తనకు నర్సుగా ఉన్న అనుభవాన్ని ఆయుధంగా మార్చుకున్న సురేఖ, ముందే పథకం వేసుకుని తల్లిదండ్రులను హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిద్రలో ఉన్న తల్లిదండ్రులకు కెటామైన్ కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. సూది మందు ఇస్తున్నానని చెప్పడంతో తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని విచారణలో తేలింది.
ఘటన అనంతరం సురేఖ సాధారణంగా నటిస్తూ తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి, తల్లిదండ్రులు సృహ తప్పి పడిపోయారని చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన అశోక్ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి అనుమానం వ్యక్తం చేశాడు. వారి మృతిపై స్పష్టత లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలపై గాయాలు లేకపోయినా, పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండటంతో లోతైన విచారణ చేపట్టారు. సురేఖ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించగా, చివరకు తానే తల్లిదండ్రులను హతమార్చినట్లు అంగీకరించింది. ఆమె ఉపయోగించిన ఇంజెక్షన్లు, ఔషధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ALSO READ: President Murmu: వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న దేశం





