హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఇంట్లో నెయ్యి తయారు చేసే వాళ్లకు ఒక సందేహం తరచూ వస్తుంటుంది.. ఆవు పాలతో ఎక్కువ నెయ్యి వస్తుందా? లేక గేదె పాలతోనా? అలాగే ఆరోగ్యానికి ఏ పాలు మంచివి? ఈ రెండింటిలోనూ మంచి పోషకాలు ఉన్నప్పటికీ.. నెయ్యి వచ్చే పరిమాణం, శరీరానికి అందే ప్రయోజనాల్లో కొంత తేడా ఉంటుంది.
నెయ్యి పరంగా చూస్తే గేదె పాలు ముందుంటాయి. కారణం.. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం. సాధారణంగా ఆవు పాలలో 3 నుంచి 4 శాతం వరకు ఫ్యాట్ ఉంటే.. గేదె పాలలో అది 7 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. అందుకే గేదె పాలు మరింత చిక్కగా, క్రీమీగా ఉంటాయి. వెన్న, నెయ్యి కూడా ఎక్కువగా వస్తాయి.
డెయిరీ రైతుల అంచనా ప్రకారం.. 1 కిలో నెయ్యి తయారుచేయాలంటే దాదాపు 16 నుంచి 20 లీటర్ల గేదె పాలు అవసరం అవుతాయి. అదే ఆవు పాలతో అయితే 27 నుంచి 30 లీటర్ల వరకు కావచ్చు. అందుకే ఎక్కువ నెయ్యి కోసం చాలామంది గేదె పాలనే ఎంచుకుంటారు.
ఆరోగ్య పరంగా చూస్తే ఆవు పాలు తేలికగా జీర్ణమవుతాయి. కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు, వృద్ధులు లేదా తక్కువ శారీరక శ్రమ చేసే వారికి ఇవి మంచి ఎంపికగా భావిస్తారు.
గేదె పాలు మాత్రం ఎక్కువ క్యాలరీలు, ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి. శారీరకంగా ఎక్కువ కష్టపడేవారు, క్రీడాకారులు లేదా శరీరానికి ఎక్కువ శక్తి అవసరమయ్యే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆవు పాలతో చేసే నెయ్యి సహజంగా పసుపు రంగులో ఉంటుంది. అందులో ఉండే బీటా కెరోటిన్ కారణంగా ఆ రంగు వస్తుంది. గేదె పాల నెయ్యి మాత్రం తెలుపు లేదా లైట్ క్రీమ్ కలర్‌లో కనిపిస్తుంది.
ఎక్కువ నెయ్యి కావాలంటే గేదె పాలు మంచి ఎంపిక. తేలికగా జీర్ణమయ్యే పాలు కావాలంటే ఆవు పాలు బెస్ట్. రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం, శరీర అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి ఏది మీకు సరిపోతుందో అదే ఎంచుకోవచ్చు