
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ తలెత్తుతున్న నేపథ్యంలో వైద్య శాఖ సున్నితంగా స్పందిస్తోంది. ప్రజల్లో ఆందోళన అవసరం లేదని తెలిపినప్పటికీ, జాగ్రత్త చర్యలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పరిధిలో ఓ పాజిటివ్ కేసు నమోదవడంతో, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది.
మల్కాజిగిరి, వనస్థలిపురం, కొండాపూర్ లలో టెస్టింగ్ సెంటర్లు ప్రస్తుతం మల్కాజిగిరి ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ మరియు కొండాపూర్ జిల్లా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
గాంధీ హాస్పిటల్ వర్గాలు 60 పడకలతో మూడు ప్రత్యేక వార్డులు సిద్ధం చేశాయి. అత్యవసరంగా వచ్చే రోగుల కోసం 15 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అలాగే, 10 మంది వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక కొవిడ్ కమిటీ ఏర్పాటు చేశారు.
కోవిడ్ కమిటీ బాధ్యతలు : ఈ కమిటీ ఆధ్వర్యంలో పాజిటివ్ కేసులకు తక్షణ వైద్యం, ఐసొలేషన్, ఔషధ పంపిణీ వంటి చర్యలను పర్యవేక్షిస్తారు. కమిటీ చైర్మన్‌గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, నోడల్ అధికారిగా డాక్టర్ సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇతర శాఖల హెచ్‌వోడీలు సభ్యులుగా ఉన్నారు.
వైద్యుల సూచనలు:
– జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు వంటి లక్షణాలుంటే కరోనా టెస్ట్ చేయించుకోండి
– దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి
– పాజిటివ్ వచ్చినవారు ఐసొలేషన్ పాటించి వైద్య సలహాల ప్రకారం మందులు వాడాలి
ప్రజలంతా హుషారుగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మరోసారి నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.