
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ప్రాణాంతక వైరస్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా… భారత్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చింది. రోజు రోజుకూ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో.. వైరస్ వర్రీ మొదలైంది. మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా మరింత ప్రాణాంతకంగా మారింది. మన దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 257 కరోనా కేసులు ఉండగా… కేరళలో 100కిపైగా కేసులు ఉన్నాయి. వీరిలో 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన ఒక వ్యక్తి చనిపోయినట్టు కూడా ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇక.. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కరోనా కేసులు ఉన్నాయి.
ఈసారి కరోనా సోకిన వారిలో లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్తున్నాయి. ముందుగా జ్వరం వస్తుంది. దాంతో పాటు పొడి దగ్గు, జలుబు కూడా ఉంటాయి. వారం వరకు ఇలానే ఉంటే… శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడుతున్నాయి. వెంటనే వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం… ఇన్ఫెక్షన్ ఎక్కువవుతంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు మొదలవుతాయి. నెమ్మదిగా.. న్యూమోనియా కూడా అటాక్ అవుతుంది. ఆ తర్వాత కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజులకు మించి జ్వరం ఉన్నా… పొడి దగ్గు, జలుబు తగ్గకపోయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మనం తీసుకోబోయే జాగ్రత్తలే.. మన ప్రాణాలకు రక్ష అని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మన దేశంలోనూ కేసులు నమోదుకావడంతో.. ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా… అలర్ట్ అయ్యింది. వైద్యాధికారులను అప్రమత్తం చేసింది.
వైరస్ వ్యాప్తి చెందగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు.. కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. లేదంటే.. వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శానిటైజ్ వాడాలి. జలుబు, ఫ్లూ ఉన్న వారికి దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వాడాలి. షేక్ హ్యాండ్ కొన్ని రోజులు మర్చిపోతేనే మంచిది. బీ కేర్‌ఫుల్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుందాం. ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే… ప్రాణాంతక వైరస్ బారిన పడకుండా కాపాడుకుందాం. స్వీయ రక్షణ పాటిద్దాం.