నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేగింది. భార్యలు ధర్నా చేయడంతో కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆందోళనకు దిగారు. అయితే అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది పోయి ఆందోళన చేసిన వారి భర్తలను సస్పెండ్ చేశారు. బెటాలియన్ ఉన్నతాధికారులు ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించి.. కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న 20 మందిని సస్పెండ్ చేశారు.
12 బెటాలియన్ ముందు ధర్నాకు దిగారు పోలీసుల కుటుంబసభ్యులు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమిళనాడు, కర్ణాటక తరహాలో ఏక్ పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై కాసేపు ధర్నా చేశారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు.