
వనపర్తి జిల్లా ప్రతినిధి, (క్రైమ్ మిర్రర్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ నాయకులే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవ్యవస్థలపై కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళితే, ధాన్యం తూకం సమయంలో తరుగు ఎక్కువగా తీసేస్తున్నారని, అలాగే కాంట వేసిన వడ్లను కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటివరకు తరలించకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు రాస్తారోకోకు దిగారు.
“ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామనే మాకు సమస్యలు ఉండవా? రైతుల బాధలు ఎవరైనా పట్టించుకోవాలే తప్ప, రాజకీయాల పేరిట వదిలేయలేం,” అని ధర్నాలో పాల్గొన్న ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. అయితే, “మీరు అధికార పార్టీ నాయకులు అయ్యి కూడా రోడ్డుపైకి దిగడం సిగ్గు పడాల్సిన విషయం కాదా.?” అని అక్కడే ఉన్న రైతులు నిలదీయడం గమనార్హం. రైతులు ధాన్యం తరలింపుపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఈ ఘటనలో రైతులు – నాయకులు ఒక్కటై ప్రభుత్వ నిర్లక్ష్యంపై గళమెత్తడమే ప్రత్యేకంగా కనిపించింది. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.