ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ స్టార్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తె.. సినీ ఇండస్ట్రీలో సోను సూద్ కి ఫోన్ చేస్తారు.. ఇక్కడ ఉన్న ఐకాన్ స్టార్లకు కాదన్నారు.అభిమానులకు ఆపద వస్తె కనీస సాయం కూడా సినీ ప్రముఖులు చేయడం లేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి సినిమా వాళ్ల పట్ల ఎలా వ్యవహరించారో చూశాం.. అలా మా ప్రభుత్వం వ్యవహరించలేదని చెప్పారు.
ఎన్టీఆర్,ANల వారసులం అని గొప్పగా చెప్పుకొనే ఈ పెద్దలు ఎవరు సాయం చేసి వార్తల్లో నిలువలేదు లేదని ఎమ్మెల్యే యెన్నం విమర్శించారు. ఖరీదైన వాచీలు.. కార్లు కొని వార్తల్లో నిలుస్తున్నారని మండిపడ్డారు. చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్యాంక్ పెట్టి ఈమధ్య కాలంలో సేవ చేస్తున్నారని.. చిరంజీవి వారసులుగా చెప్పుకునే హీరోలు ఎవరికైనా ఒక్కరూపాయి సాయం చేశారా అని యెన్నం నిలదీశారు. యువ స్టార్ లుగా గొప్పలు చెప్పుకునే హీరో లు ఏ పాఠశాలనైనా గ్రామాన్ని అయిన దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. వీళ్ళ కన్న సోను సూద్ వంద రెట్లు బెటర్.. ఆపద వస్తె.. అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ఫోన్లు చేయరని తెలిపారు. వీళ్ళ కన్న సమంత,మంచు లక్ష్మి లు సామాజిక సేవ బాగా చేస్తున్నారని యెన్నం అన్నారు.
ప్రజలతో సంబంధం లేకుండా పెరిగారు కాబట్టే వీళ్ల రాతిగుండే కరగటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీకన్న సామాజిక సేవలో వెయ్యి రెట్లు రాజకీయ నాయకులు బెటర్ అన్నారు. సంధ్య ధియేటర్ ఘటన తర్వాత ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వారు లక్ష రూపాయలు ఇవ్వడానికి వెనుకడుతున్నారని విమర్శించారు. ప్రజలను వినియోగ వస్తువులుగా కాదు.. ప్రజలుగా చూడండని హితవు పలికారు. తమిళ నటులతో పోల్చితే తెలుగు నటులకు సామాజిక బాధ్యతలో వెనక ఉన్నారని చెప్పారు.హీరోలను స్టార్ లు చేస్తే గుండెల్లో గునపాలు దింపారని ధ్వజమెత్తారు. గ్లోబల్ టెక్నాలజీ వచ్చిన యుగంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు చూస్తేనే డబ్బులు వస్తాయన్నారు. స్టార్ల సినిమాలు నైజాం ఏరియాలో బైకాట్ చేస్తే వాళ్ళు అడుక్కు తింటారని యెన్నం మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ప్రవర్తన చూశాం.. ఇప్పుడు చూస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఉద్యమానికి ఒక్కసారి అండగా నిలబడలేదన్నారు. తెలంగాణ లో ఏ టెక్నిషన్ ఎదగకుండా చేస్తున్నారు.. ఇంకా ఎంతకాలం భరించాలి..వాళ్లకు నచ్చిన వాళ్ళే ఎదుగుతున్నారని మండిపడ్డారు.