Commonwealth Games 2030: 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం భారత్ కు దక్కింది. నెల రోజుల క్రితమే భారత్ పేరు దాదాపు ఖాయం అయినప్పటికీ, తాజాగా జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ కోరుకుంటున్న సమయంలో.. ఈ కామన్వెల్త్ గేమ్స ఆతిథ్య హక్కులు దక్కడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రీడలకు 2030లో వందేళ్లు పూర్తి కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం నైజీరియాతో పాటు పలు దేశాలు పోటీ పడగా, చివరికి భారత్ కు ఈ అవకాశం దక్కింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది. చివరి సారిగా భారత్ 2010 కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీలో ఈ వేడుకలు జరిగాయి.
భారత్ దార్శినికతను నిదర్శనం
అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కిడం భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత్‌ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చాలనే ప్రధాని మోడీ దార్శనికతకు ఇది నిదర్శనమన్నారు. దశాబ్దానికి పైగా సాగిన కృషితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను మోడీ అభివృద్ధి చేశారని చెప్పారు. సమర్థమైన పాలన ద్వారా మన దేశ సామర్థ్యాన్ని మెరుగుపరిచారని చెప్పుకొచ్చారు.
15కు పైగా విభాగాల్లో పోటీలు
2030 కామన్వెల్త్ గేమ్స్ మొత్తం 15కు పైగా విభాగాల్లో పోటీలు ఉండనున్నట్లు కామన్వెల్త్ స్పోర్ట్ వెల్లడించింది. వీటిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్ సహా మరికొన్ని ఇప్పటికే ఖరారయ్యాయి. ఇంకొన్నింటిని ఎంపిక చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్, వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, రగ్బీ సెవెన్స్ వంటి వాటిపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.





