ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ఎమ్మెల్యేల ఇసుక దందాలు.. తాట తీస్తానని సీఎం వార్నింగ్

ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ఆయన మంత్రులకు తేల్చి చెప్పారు. ఇసుకలో ఎమ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులు తేల్చేందుకే ఈ నెల 18న టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నార్కోటిక్స్ టాస్క్​ఫోర్స్​పై కూడా సీఎం, మంత్రులతో చర్చించారు. రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయ్ షీట్స్ తెరిస్తే బాగుంటుందని పలువురు అమాత్యులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు.

ఈ క్రమంలోనే వచ్చే 10 రోజుల్లో ఉచిత ఇసుక విధానంలో మార్పు రాకుంటే ఉపేక్షించనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉచిత ఇసుక అందించి తీరాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.

రవాణా ఛార్జీలు తప్ప లబ్ధిదారులకు మరెలాంటి ఛార్జీలు పడకూడదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎవరైనా వచ్చి వారే ఇసుక తవ్వుకుని తీసుకెళ్తామంటే ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని వెల్లడించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మూడు నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని ఇకపై అలా ఉండకూడదని తేల్చిచెప్పారు. ట్రాక్టర్ మీద వెళ్లినా, పక్క ఊరు నుంచి ఇసుక తెస్తున్నా ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిబంధనలు ఎవరు పెట్టారని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నార్కోటిక్స్ టాస్క్​ఫోర్స్​పై కూడా వాడీ వేడి చర్చ జరిగింది. జనం ముందు గంజాయి బ్యాచ్​కి సామాజిక సేవా శిక్షలు వేస్తే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. దొంగలున్నారు జాగ్రత్తని వివిధ పబ్లిక్ ప్రదేశాల్లో ఫొటోలు ప్రదర్శించినట్లు గంజాయి బ్యాచ్ ఫొటోలు పెడితే బాగుంటుందని హోం మంత్రి అనిత సూచించారు. కేబినెట్ ఆమోదించిన వివిధ పాలసీలపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి దిక్సూచిలా వివిధ పాలసీలు ఉన్నాయంటూ అభినందించారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలపైనా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎంఎస్​ఎంఈ, ఎలక్ట్రానిక్స్ వంటి పాలసీలపై చర్చించారు. ఈ పాలసీలన్ని పేదల అభ్యున్నతికే అని మంత్రులు వ్యాఖ్యానించారు. చెత్త పన్నుపై కేబినెట్​లో ప్రస్తావించగా దీనిపై ఉన్నచట్టాన్ని సవరణ చేయాల్సి వుంటుందని అమాత్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 టన్నుల చెత్త ఉందని అది తొలగించేందుకు చాలా సమయం పడుతుందని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై తక్షణమే యాక్షన్ ప్లాన్ రూపొందించి చెత్తను తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి గిడ్డంగుల కార్పొరేషన్ ద్వారా నిధుల మంజూరుపై మంత్రిమండలి చర్చించింది. గత ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా నిధుల మంజూరుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button