తెలంగాణ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్! మునుగోడులో రేవంత్ టీం ఎంట్రీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి పోటీగా తన టీంను సీఎం రేవంత్ రెడ్డి మునుగోడులో దింపారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదన్నట్లుగా.. ఒక రకంగా రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టేలా రేవంత్ టీం పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందుకే రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసేలా మరో నేతను రేవంత్ రెడ్డి మునుగోడులో తిప్పుతున్నారని అంటున్నారు.

గత 20 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చలమల కృష్ణారెడ్డి సడెన్ గా మునుగోడులో తిరుగుతున్నారు. మునుగోడు ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ గానే చలమల ఈ ప్రకటన ఇచ్చారని టాక్. చలమల కృష్ఢారెడ్డి మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు. వ్యాపార వేత్తగా ఉన్న చలమల.. రేవంత్ రెడ్డి పిలుపుతోనే కాంగ్రెస్ లో చేరారు. 2022 రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు.. చలమలను మునుగోడులో దింపారు సీఎం రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అంతా తానే వ్యవహరించారు. మునుగోడు ఉపఎన్నికలో చలమల పోటీ చేయాలని భావించినా.. ఎలాగూ ఓడిపోయే సీటు కాబట్టి వద్దని రేవంత్ వారించారని తెలుస్తోంది. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చి ఆమెను బలి పశువు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ పెత్తనమంతా మళ్లీ చలమలకే కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.

2023 అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల కృష్ణారెడ్డికి టికెట్ దాదాపుగా ఖాయమైంది. అయితే చివరి నిమిషంలో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టికెట్ ఆయనకు ఇచ్చింది హైకమాండ్.రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ ఇష్టంగా లేకపోయినా.. హైకమాండ్ ఆయనతో నేరుగా సంప్రదింపులు జరిపింది. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో.. బీజేపీలోకి జంప్ కొట్టారు చలమల కృష్ణారెడ్డి. టికెట్ కూడా తెచ్చుకున్నారు. అయితే చలమల పోటీతో కాంగ్రెస్ కు కష్టాలు తప్పవని గ్రహించిన రేవంత్ రెడ్డి పోలింగ్ కు నాలుగు రోజుల ముందు మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. చలమలను సైలెంట్ చేశారు. రేవంత్ ఆదేశాలతో పోలింగ్ కు రెండు రోజుల ముందు ఎవరికి కనిపించకుండా అదృశ్యమయ్యాడు చలమల కృష్ణారెడ్డి. మునుగోడు బీజేపీ నేతలను రోడ్డున పడేసి పోలింగ్ రోజు కాడి ఎత్తేశాడు. రేవంత్ మాట కోసం చలమల బీజేపీని మోసం చేశారనే ప్రచారం సాగింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా మళ్లీ సీఎం రేవంత్ సూచనతో కాంగ్రెస్ లో చేరారు చలమల కృష్ణా రెడ్డి. అయితే మునుగోడు రాజకీయాల్లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డికి పోటీగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కాని సీఎం రేవంత్ రెడ్డి టీంలో యాక్టివ్ గానే ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండటంతో రేవంత్ రెడ్డి మరో స్కెచ్ వేశారని తెలుస్తోంది. మునుగోడులో చలమల ఎంట్రీ వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందంటున్నారు. అందుకే రెండు, మూడు రోజులుగా తన అనుచరులతో చలమల మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే భారీ ర్యాలీతో ఆయన మునుగోడులో పర్యటించబోతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. చలమల ఎంట్రీ ఇస్తే మాత్రం మునుగోడు కాంగ్రెస్ లో కల్లోలం తప్పదు. చలమల వస్తే రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button