
CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధికి వినూత్న దిశగా అడుగేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్లకు నేతల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని మార్చి, ప్రముఖ కంపెనీల పేర్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించడమేనని చెప్పారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. హైదరాబాద్‌ను అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడమే తన మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పెట్టుబడిదారులకి అత్యుత్తమ గమ్యస్థానమని అన్నారు. భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం నగర ప్రత్యేకత అని తెలిపారు. తెలంగాణ యువత ప్రతిభావంతులు, రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు వేగంగా ఉందని గుర్తుచేశారు. గత 35 ఏళ్లుగా పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు 30 వేల ఎకరాల్లో నిర్మాణమవుతుందని, ఇది దేశంలోనే ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ నది పునరుజ్జీవనంతో హైదరాబాద్ లండన్, టోక్యో తరహాలో నైట్ ఎకానమీకి నూతన దశను తెస్తుందని చెప్పారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌లాంటి ప్రాజెక్టులు నగర భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు.
సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సీఎం ప్రదర్శించగా, సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ తదితరులు ప్రశంసలు కురిపించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం లక్ష్యమని సీఎం వెల్లడించారు. డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అమెరికా-భారత్ వ్యూహాత్మక ఫోరం అధ్యక్షుడు ముఖేష్ ఆఘి హాజరవుతారని తెలిపారు.
ALSO READ: Bihar Elections: కౌంటింగ్ వేళ అధికారులకు ఆర్జేడీ నేత వార్నింగ్





