HomeతెలంగాణCM Revanth: గొప్ప ప్రాజెక్ట్ అనుకునేలోపే కాళేశ్వరం కుప్పకూలింది

CM Revanth: గొప్ప ప్రాజెక్ట్ అనుకునేలోపే కాళేశ్వరం కుప్పకూలింది

CM Revanth: ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమీపంలో నిర్మాణంలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు స్థితిగతులను అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాల అంశం కొంతకాలంగా రాజకీయ రంగు దాల్చిందని వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న పథకాలను సమయానికి పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు ఉత్పన్నం కావాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు.

ఒకే ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిగతా పథకాలను నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు భూసేకరణ, నిర్మాణ పనుల కోసం తీవ్రమైన నిధుల కొరత ఏర్పడిందని తెలిపారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి వచ్చే 2 నుండి 3 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని పెండింగ్ పథకాలను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రూ.6 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన దేవాదుల పథకం ప్రస్తుతం రూ.18 వేల కోట్ల వ్యయానికి చేరుకుందని వెల్లడించారు. తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నీళ్లు, నిధులు సమృద్ధిగా ఉన్నాయని, కానీ గత పాలకుల విధానాల వల్ల పరిస్థితి దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. ఒకే ప్రాజెక్టుపై లక్ష కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పథకాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. భారీగా ఖర్చు చేసి నిర్మించిన ఆ ప్రాజెక్టు నిలకడగా నిలవలేకపోయిందని, అయినప్పటికీ రాష్ట్రంలో వరి దిగుబడి అత్యధికంగా నమోదవుతుండటం రైతుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో ఇప్పటికే సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై విస్తృతంగా చర్చించామని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజలకు తెలియజేశామని చెప్పారు.

గత పాలనలో జరిగిన నిర్లక్ష్యం, నిర్ణయాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ప్రజలు గ్రహించారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, నీటి హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఇప్పుడైనా సానుకూల చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. గత 10 సంవత్సరాల్లో వారు చేసిన పనులు, గత 2.5 సంవత్సరాల్లో తాము చేసిన పనులపై సభలోనే బహిరంగంగా చర్చించుకుందామని పిలుపునిచ్చారు. విమర్శలు, ప్రతివిమర్శలు పక్కనపెట్టి అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అనుభవం ఉన్నవారు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు. కృష్ణా జలాల విషయంలో ఇతర రాష్ట్రానికి సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ALSO READ: Jobs: నెలకు రూ.31 వేల జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు