
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సిఎం రేవంత్ రెడ్డి. సిఎంతో పాటు మరి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హస్తిన వెళ్లనున్నారు. బిసి కులగణన,ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మాణాలపై అధిష్టానం పెద్దలతో కలిసి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణపై చర్చ కూడా ఉంటుందని.. స్దానిక సంస్దల ఎన్నికలు దృష్ట్యా మంత్రి వర్గ విస్తరణ ఉండనుందని చెబుతున్నారు.
ఇటీవలే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్ లో ప్రత్యేకంగా సమావేశం కావడం పార్టీలో కలకలం రేపింది. ఈ విషయంలో హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం కావడం.. మరోవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు సమావేశానికి ఇద్దరు మంత్రులు సహకరించారనే వార్తలు వస్తున్నాయి. రహస్యంగా సమావేశమైన ఎమ్మెల్యేల మంత్రుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేయడం.. కమీషన్లు తీసుకుంటున్నారని.. అక్రమంగా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో తెలంగాణలో అసలు ఏం జరుగుతుందన్న విషయాలు ఆరా తీయడానికే సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై చర్చించడానికే సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు హస్తినకు వెళుతున్నారనే చర్చ సాగుతోంది. స్థానిక సంస్థలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అంతకుముందే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తూ చేయాలని చూస్తుందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెర్త్ ఖాయమని అంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ నుంచి ఆయనకు సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. అందుకే బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారని అంటున్నారు.