తెలంగాణ

ముగ్గురిని జైలుకు పంపేలా ప్లాన్! రేవంత్ దెబ్బకు వణుకుతున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై వరుసగా విచారణ చేయిస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా రేసింగ్ లకు సంబంధించిన విచారణలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఫార్ములా రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌.. హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికింది. కేటీఆర్‌ను మరో 10 రోజులపాటు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఈ కేసు దర్యాప్తును కంటిన్యూ చేయాలని చెప్పింది. దాంతో కేటీఆర్‌ కు చిక్కులు తప్పవనే టాక్ వస్తోంది.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ స్టార్ చేసింది. ఇప్పటికే ఈ రెండు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తోంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. విద్యుత్ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై వేల కోట్ల భారం పడేలా చేసిందని నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ నిర్వహించి కేసీఆర్ పై అవసరమైతే కేసు కూడా నమోదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే కేసీఆర్ పై కూడా కేసు నమోదుకు రంగం సిద్దమైనట్లుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరగుతోంది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపైన కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. గత రెండు మూడు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను విచారించింది. తమ పాత్ర చాలా పరిమితం అని నాటి ప్రభుత్వాధినేత చెప్పినట్లుగా తాము నడుచుకున్నామని విచారణకు హాజరైన అధికారులు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులతో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్‌ రావు పేరు కూడా కమిషన్ తెరపైకి తీసుకు వచ్చింది. అధికారులు కూడా పలు సందర్భాల్లో హరీష్‌ రావు పేరును చెప్పినట్లు టాక్‌. ఇప్పటివరకు కేవలం కేసీఆర్, కేటీఆర్ పేర్లు మాత్రమే వినిపించగా తాజాగా హరీష్‌ రావు పేరు తెరమీదకు రావడం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారింది. కాళేశ్వరం కేసులో హరీష్‌ రావును కూడా కాంగ్రెస్ ఇరికించబోతుందా అన్న చర్చ మొదలైంది..

ఇక ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్, విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్, కాళేశ్వరం అంశంలో హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ కీలక నేతలను ఒకే సారి కేసులో ఇరికించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.అయితే కేసుల విషయంలో బీఆర్ఎస్ నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. తమ అధినేతతో పాటు కేటీఆర్‌, హరీశ్‌ రావును కావాలనే ఈ కేసుల్లో ఇరికిస్తున్నారని గులాబీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

Back to top button