
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ దేశానికి కొత్త గేట్‌వేగా మారుతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఏపీ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా వేగంగా ఎదుగుతోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ వ్యాప్తంగా నమ్మకం ఏర్పడి, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ప్రతిభ, విస్తృత వనరులు, ఆధునిక సాంకేతికతను సమర్థంగా ఉపయోగించగలిగితే దేశానికి ఎదురులేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత వైపు ఆసక్తిగా చూస్తున్నాయని చెప్పారు. పేదరికం తగ్గించేందుకు, అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచడంలో, స్వచ్ఛాంధ్ర నిర్మాణంలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని తెలిపారు. ఐటి రంగంలో ఎక్కడికెళ్లినా తెలుగువారు తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు.
ఏపీని నూతన సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు రూపొందుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. సోలార్, విండ్, పంప్‌డ్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు వరుసలో నిలుస్తోందని తెలిపారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ను దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు.
పెట్టుబడిదారులు ఏపీపై చూపిస్తున్న విశ్వాసం పెరుగుతోందని, అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తూ ప్రపంచ మార్కెట్లలో ప్రాధాన్యం కలిగించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొత్తం మీద, దేశానికి గేట్‌వేగా ఏపీ ఎదుగుతుందనే ధృఢ విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.
ALSO READ: An Industry record?: జన నాయకుడు థియేట్రికల్- నాన్ థియేట్రికల్ హక్కుల దుమారం





