
క్రైమ్ మిర్రర్, హత్నూర్ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప తండాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో నితున్ అనే 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, బాలుడు నితున్ ఇంటి సమీపంలోని కిరాణా షాప్‌కు వెళ్లినపుడు అకస్మాత్తుగా వీధిలో సంచరిస్తున్న నాలుగు కుక్కలు అతనిపై ఒక్కసారిగా దాడి చేశాయి. శరీరంపై తీవ్ర గాయాలుచేశాయి. తండా వాసులు కేకలు వేయడంతో కుక్కలు తప్పించుకున్నాయి.
బాలుడి తలకు, మెడకు తీవ్రగాయాలవడంతో బాలుడ్ని అత్యవసరంగా నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శరీరంలో ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలుడు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
గురువారం నితున్ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కానీ మరుసటి రోజే ఇలా విషాదాంతం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తాండా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. అయినా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు,” అని ఓ గ్రామస్థుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల కల్లోలం కొనసాగుతుండగా, బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.