తెలంగాణరాజకీయం

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పోటీ - ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కేసీఆర్‌ వ్యూహం

పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. పార్టీలన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల బలా బలాలు చూస్తే.. కాంగ్రెస్‌కు మూడు, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కుతుంది. ఇక.. ఐదో స్థానం ఎవరిది అన్నదే ఉత్కంఠగా మారింది. ఐదో స్థానం సాధించేందుకు కాంగ్రెస్‌కు గానీ.. బీఆర్‌ఎస్‌కు గానీ.. తగిన సంఖ్యా బలం లేదు. దీంతో… ఐదో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక పెట్టాల్సిందే. ఆ స్థానం ఎవరు దక్కించుకుంటారనేది… మిగిలిన పార్టీల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే… తన అనుభవానికి పదును పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. రెండు స్థానాలకు పోటీ చేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.

పార్టీల బలాబలాలు చూస్తే… అసెంబ్లీలో మొత్తం సభ్యులు 119 మంది. ఇందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 64 మంది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన సీపీఐకి మరో ఎమ్మెల్యే ఉన్నారు. అంటే.. కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే… 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ బలం 65 మంది ఎమ్మెల్యేలు కనుక… (20×3=60) ముగ్గురు ఎమ్మెల్సీలను కచ్చితంగా గెలిపించుకోవచ్చు. ఇక కాంగ్రెస్‌ దగ్గర ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. నాలుగో ఎమ్మెల్సీ దక్కించుకోవాలంటే… ఈ బలం సరిపోదు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఎటువైపు ఓటు వేస్తారన్నది అంచనా వేయలేం. వీరితో కలుపుకున్నా కాంగ్రెస్‌ దగ్గర 15 మంది ఎమ్మెల్యేలే ఉంటారు… కనుక మూడో ఎమ్మెల్సీ గెలుపు కాంగ్రెస్‌కు కష్టమే.

గులాబీ పార్టీ విషయానికి వస్తే… అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 39 స్థానాల్లో గెలించింది. అయితే… అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ 10 మందిని తీసేస్తే… బీఆర్‌ఎస్‌ దగ్గర 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఒక ఎమ్మెల్సీని కచ్చింగా గెలిపించుకుంటుంది బీఆర్‌ఎస్‌. పోగా.. బీఆర్‌ఎస్‌ దగ్గర 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. దీంతో.. రెండో ఎమ్మెల్సీ గెలుపు కష్టమే.

ఇకపోతే… బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలం లేదు కనుక… బీజేపీ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎంఐఎం విషయానికి వస్తే… తమ సీటు తమకే కావాలని పట్టుబడుతోంది. ఎంఐఎం ఎమ్మెల్సీ రియాజుల్‌ హసన్‌ పదవీ కాలం పూర్తవడంతో… ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో అది ఒకటి ఉంది. ఆ ఎమ్మెల్సీ తమ పార్టీకే ఇవ్వాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది ఎంఐఎం. అయితే.. కాంగ్రెస్‌ అందుకు సిద్ధంగా లేదు. పొత్తు ధర్మంలో భాగంగా.. ఒక ఎమ్మెల్సీని సీపీఐకి ఇవ్వాలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం దారెటు..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే మాత్రం… నాలుగో స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుంది.

ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌… తన వ్యూహానికి పదును పెడుతున్నారు. సరిపడా బలం లేకపోయినా… రెండో ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది బరిలోకి దిగితే.. కచ్చితంగా ఓటింగ్‌ జరుగుతుంది. దీంతో… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారుతుంది. వారిని ఇరుకున పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారట. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీకి ఓటు వేస్తారా..? లేక.. సొంత పార్టీకి అండగా నిలుస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button