Charlapalli–Thiruvananthapuram Amrit Bharat Express: సామాన్య ప్రయాణికులకు వందేభారత్ తరహా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మీదుగా ఓ సర్వీసు నడుస్తుండగా, ఇప్పుడు మరో సర్వీసు అందుబాటులోకి రానుంది.
ఇవాళ నాలుగు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం
కేరళలోని తిరువనంతపురం నుంచి దేశవ్యాప్తంగా 4 అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ (జనవరి 23) ప్రారంభించనున్నారు. ఇప్పటికే చర్లపల్లి- ముజఫర్‌పూర్ మధ్య ఒక అమృత్ భారత్ సేవలందిస్తుండగా, తాజాగా ప్రారంభం కానున్న తిరువనంతపురం- చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణకు రెండోది. జనవరి 27నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైలు ప్రతి మంగళవారం ఉదయం 7గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో మొదలై, గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.
తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ.. ఏపీలోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల మీదుగా రైలు ప్రయాణిస్తుంది. ప్రయాణికులు శుక్రవారం నుంచి రైల్‌వన్ యాప్ లేదా టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
అమృత్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు
ఈ రైళ్లు పూర్తిగా నాన్‌ఏసీ అయినప్పటికీ, వందేభారత్ తరహాలో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్, 2 దివ్యాంగుల కోచ్‌లతో పాటు ఒక ప్యాంట్రీకార్ ఉంటాయి. రెండు చివర్ల ఇంజన్లు ఉండడం వల్ల త్వరగా వేగం పుంజుకుంటుంది. మెరుగైన ఎర్గొనామిక్ డిజైన్, ప్రతిసీటు వద్ద చార్జింగ్ పాయింట్లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్‌తో పాటు ప్రతి కోచ్‌లో సీసీటీవీ పర్యవేక్షణ, సెన్సార్ ఆధారిత ట్యాప్‌లు, మోడరన్ టాయిలెట్లు, ఎలక్ర్టో-న్యూమాటిక్ ఫ్లషింగ్ తదితర ప్రయోజనాలున్నాయి. దివ్యాంగులకు అనుకూలంగా స్పెషల్ కోచ్‌లు, వీల్‌చైర్ రాంప్‌లు, ఆన్‌బోర్డ్ ఫుడ్ సర్వీస్ వంటివి ఉంటాయని అధికారులు వెల్లడించారు.





