-
అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు
-
రాజ్యసభలో మద్దతు తెలిపిన బీఆర్ఎస్
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ డెస్క్: కేసీఆర్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారా…? అమరావతి చట్టబద్ధతకు బీఆర్ఎస్ మద్దతు తెలిపినందుకు థాంక్స్ చెప్పారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే హాట్ టాపిక్. రెండు రోజుల కిందట రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పించి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అన్నింటికీ మించి రాజ్యసభలో గులాబీ పార్టీ తరఫున ఆమోదం లభించడం నిజంగా శుభ పరిణామం. అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినందుకు కేసిఆర్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రచారం నడుస్తోంది.
సానుకూల ప్రకటన…
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే లోక్ సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది.
రాజ్యసభలో బిల్లుపై చర్చ జరిగిన సమయంలో బిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తాము అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కెసిఆర్ స్వయంగా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రకటించారు. బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే ఈ హఠాత్ పరిణామంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆ రెండు పార్టీల మధ్య స్నేహం…
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గులాబీ పార్టీకి స్నేహం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించి ఆదరిస్తారు కేసీఆర్. కానీ అమరావతి రాజధాని విషయంలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వానికి కేసీఆర్ అండగా నిలిచినట్లు అయింది. అయితే అమరావతిని వ్యతిరేకిస్తే తెలంగాణలో రాజకీయ ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావించినట్టు ఉన్నారు. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో టిడిపి మౌనం దాల్చడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయింది.
గులాబీ పార్టీకి దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది టిడిపి కూటమి. ఆ పార్టీతో అనవసరంగా పెట్టుకుంటే రాజకీయంగా తమకు డామేజ్ ఖాయమని కేసీఆర్ కు తెలుసు. పోనీ ఆ బిల్లుకు వ్యతిరేకిస్తే రాజకీయంగా వచ్చేది ఏమీ లేదు. మద్దతు తెలిపిన పోయేదేమీ లేదు. అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
మారిన పరిస్థితులు…
అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రచారం నడుస్తోంది. రాజకీయంగా బద్ధ శత్రువులు అయినా కేసీఆర్ విషయంలో చంద్రబాబు సానుకూలంగానే స్పందిస్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపనకు వచ్చారు కెసిఆర్. అటు తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఇద్దరు దూరమయ్యారు. కానీ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత కెసిఆర్ అనారోగ్యానికి గురయ్యారు.
ఆ సమయంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. అందుకే అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినందుకు చంద్రబాబు కచ్చితంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపి ఉంటారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
