
President, Governors Act on Bills: బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించవచ్చా? లేదా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలు, పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించేలా కోర్టులు వారిని నిర్దేశించవచ్చా? అన్నదానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు కేంద్రం బదులిచ్చింది.
అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుంది!
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. బిల్లుల అంగీకారం అంశంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. బిల్లులపై గడువు విధింపుతో రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని కూడా కేంద్రం అభిప్రాయపడింది. ఆ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు ఉన్నత ఆదర్శాలు అని చెప్పిన కేంద్రం.. వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే న్యాయ జోక్యాల కంటే.. రాజ్యాంగపరమైన యంత్రాంగం ద్వారా సరిదిద్దాలని సుప్రీంకు కేంద్రం తెలిపింది.
Read Also: భారత్ కు చైనా విదేశాంగ మంత్రి.. పర్యటన వెనుక కారణం ఇదే!