
పుష్ప హీరో అల్లు అర్జున్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. పుష్పతో పాటు హీరోయిన్ శ్రీలలపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న అల్లు అర్జున్, శ్రీలీలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐఎస్ఎఫ్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు సినీ తారలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయి. అల్లు అర్జున్, శ్రీలీల కూడా ప్రముఖ విద్యాసంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారు. వారి ఫొటోలతో ఆయా సంస్థలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆ విద్యాసంస్థలు కొంతమంది ర్యాంకర్ల ఫొటోలతో పాటు అల్లు అర్జున్, శ్రీలీల ఫోటోలు ప్రచురించాయి. ఈ ప్రచారమే గొడవకు కారణమైంది.
కాంపిటీటివ్ పరీక్షల ఫలితాలు వస్తే తమకు ర్యాంకులు వచ్చాయంటూ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు, ఫొటోలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటాయి విద్యాసంస్థలు. అయితే కొన్నిసార్లు ఫస్ట్ ర్యాంకర్లు రెండు మూడు కాలేజీల్లో చదివినట్టు ఎవరికి వారే ప్రకటనలు ఇస్తుంటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా ఇలాగే జరిగిందని ఏఐఎస్ఎఫ్ వాదిస్తోంది. ఒకే విద్యార్థి వివిధ కాలేజీల్లో చదువుతున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారం కూడా అల్లు అర్జున్, శ్రీలీల వంటి సినీ నటీనటులతో జరుగుతోందని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.
విద్యార్థి సంఘాల నేతలు అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు పెట్టడం సంచలనంగా మారింది. ఆయా విద్యాసంస్థలతోపాటు, వాటి ప్రచారకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.