సాగర్ ఎడమ కాల్వలో కారు ప్రమాదం… దంపతులు గల్లంతు

క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారులు తల్లం పుల్లయ్య (63), తల్లం పద్మ (55) దంపతులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడిపోవడంతో గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ప్రమాదం నిడమనూరు మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది.

గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉండగా, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్మకు వెన్నెముకకు గాయాలు కావడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం మిర్యాలగూడలో కోలుకుంటున్న ఆమె, ఆరోగ్యం మెరుగుపడటంతో స్వగ్రామానికి వెళ్లాలని కోరింది.

దీంతో శివ తన కారులో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి తల్లిదండ్రులను ఇంటికి పంపించాడు. గమ్యం చేరేందుకు కొద్ది నిమిషాలే మిగిలి ఉన్న సమయంలో, ముకుందాపురం వద్ద ప్రమాదం జరిగింది. డ్రైవర్ రసూల్ చెప్పు జారిపోవడంతో దాన్ని సరిచేసే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. కారు ఒక్కసారిగా వేగం పెరిగి రహదారి పక్కనే ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకుపోయి బోల్తా పడింది. కారు అద్దం తెరుచుకోవడంతో డ్రైవర్ బయటికి బయటపడ్డాడు. అతడి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి కొబ్బరిమట్ట సాయంతో అతడిని రక్షించారు. అయితే వాహనంలోనే చిక్కుకున్న పుల్లయ్య, పద్మ దంపతులు కాల్వలోని బలమైన నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఘటనాస్థలికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ దంపతుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో డ్రైవర్ చెప్పులు వేసుకోకుండా వాహనం నడిపినట్టు గుర్తించిన పోలీసులు, అదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో కంపాసాగర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button