
జగిత్యాల, క్రైమ్ మిర్రర్:- జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు మరోసారి భగ్గుమన్నాయి. సాక్షాత్తు గాంధీ భవన్ వేదికగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రధాన అనుచరుడి హత్య జరిగిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే… హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే) హాజరయ్యారు. అయితే, సంజయ్ కుమార్‌ను అక్కడ చూడగానే జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
హంతకులతో పక్కపక్కనే ఎలా?..
ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగానే జీవన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. “నా అనుచరుడు మారు గంగారెడ్డిని చంపించిన వారిని పక్కన పెట్టుకుని మీటింగ్ ఎలా నిర్వహిస్తారు? హంతకులతో నేను వేదిక పంచుకోలేను” అని తేల్చిచెప్పారు. నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా సమావేశం నుంచి అలిగి బయటకు వచ్చేశారు.
బయటకు వచ్చిన అనంతరం జీవన్ రెడ్డి ఆవేదనతో మాట్లాడుతూ.. “మీకూ.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇస్తున్న ప్రాధాన్యత, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు దక్కడం లేదన్న ఆవేదన ఆయన గొంతులో స్పష్టంగా కనిపించింది.జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి జీవన్ రెడ్డి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు నేరుగా గాంధీ భవన్‌లోనే ఇలా జరగడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌పై పరోక్షంగా నిప్పులు చెరగడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Terror Attack Threat: గణతంత్ర వేడుకలపై ఉగ్రవాదుల గురి, తెలంగాణలోనూ హై అలర్ట్!





