1995 సంక్షోభంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా గోరంట్ల..
తిరిగి ఆలస్యంగా టిడిపిలోకి చేరిక
పదవులకు దూరం అయిన సీనియర్ నేత
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ఏపీలో మంత్రివర్గ విస్తరణ పై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. చాలామంది ఆశావహుల పేర్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఎనిమిది పదుల వయసుకు దగ్గరగా ఉన్నారు. టిడిపిలో సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. దాదాపు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒక ఏడాది పాటు మాత్రమే మంత్రి అయ్యారు. మంచి వాగ్దాటితోపాటు సబ్జెక్టు కలిగిన నేత. అయినా సరే ఆయనకు మంత్రిగా ఛాన్స్ దక్కలేదు. దానికి కారణం 1995 టీడీపీ సంక్షోభం అని ఎక్కువ మంది విశ్లేషిస్తారు. ఆ సమయంలో బుచ్చయ్య చౌదరి చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే ఈరోజుకు ఆయనకు మంత్రి పదవి రాలేదని పొలిటికల్ వర్గాల్లో టాక్. ఆరోజు కానీ బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు అనుకూలమైన నిర్ణయం తీసుకొని ఉంటే.. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి మాదిరిగా.. బుచ్చయ్య చౌదరికి మంచి రాజకీయ అవకాశాలు దక్కి ఉండేవని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ..
1995లో సంక్షోభం..
1995లో టిడిపిలో ఒక సంక్షోభం జరిగింది. నందమూరి తారక రామారావు నాయకత్వాన్ని సొంత కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు విభేదించారు. లక్ష్మీపార్వతి రాజకీయ ప్రమేయాలను సహించుకోలేకపోయారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. కానీ ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్లు చంద్రబాబు వైపు వచ్చారు. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి నేతలు మాత్రం నందమూరి తారక రామారావు వెంట ఉండిపోయారు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం వారు సైతం టిడిపిలోకి ప్రవేశించారు. అయితే బుచ్చయ్య చౌదరికి టిడిపిలో ప్రవేశం కల్పించారు కానీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కు ఆ ఛాన్స్ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లారు. తిరిగి టిడిపిలోకి వచ్చారు కానీ అకాల మృతి చెందారు.
రాజకీయంగా శాపం…
నాడు బుచ్చయ్య చౌదరి తీసుకున్న నిర్ణయమే ఆయనకు రాజకీయంగా శాపంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఆరోజు బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు అండగా నిలబడి ఉంటే ఎనలేని ప్రాధాన్యం దక్కి ఉండేది. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి చంద్రబాబు సామాజిక వర్గమే. కానీ ఆయన అప్పుడు ఆలస్యం చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతరత్రా కమ్మ సామాజిక వర్గం నేతలు. నాడు ఆలస్యంగా టిడిపిలోకి వచ్చిన క్రమంలో మిగతా కమ్మ సామాజిక వర్గం నేతలు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అలా మంత్రి పదవికి దూరమయ్యారు బుచ్చయ్య చౌదరి. లేకుంటే మిగతా సీనియర్ నేతల మాదిరిగా ఎన్నెన్నో పదవులు దక్కేవి బుచ్చయ్య చౌదరికి. ఆ ఒకే ఒక్క మిస్టేక్ ఆయనకు శాపంగా మారింది. ఆయనకు పొలిటికల్ గా కలిసి రాలేదు ఆ నిర్ణయంతో.. అయితే ఈసారైనా తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశగా ఉన్నారు బుచ్చయ్య చౌదరి. మరి ఆయన ఆశలు తీరుతాయా? లేదా? అనేది చూడాలి.
