
Business: దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా వరుస పెరుగుదలతో వినియోగదారులను కాస్త ఆందోళనకు గురి చేసిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.300 తగ్గి రూ.1,15,050 వద్దకు చేరింది. ఇంతకు ముందు రెండు రోజుల్లో వరుసగా రూ.1650, రూ.1850 చొప్పున పెరిగిన నేపథ్యంలో ఈ తగ్గుదల కొంత ఉపశమనాన్ని తీసుకొచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.330 తగ్గి 10 గ్రాములకు రూ.1,25,510కి చేరింది. దీనికంటే ముందు రెండు రోజుల్లో రూ.2020, రూ.1800 చొప్పున పెరిగి ఉండటంతో, ఈరోజు తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరట కలిగించింది.
అయితే, బంగారం ధరలు తగ్గినా వెండి మాత్రం మరోసారి ఎగబాకింది. ఒక్కరోజులోనే రూ.3,000 పెరిగి, హైదరాబాద్ మార్కెట్లో కిలోకు రూ.1.73 లక్షలకు చేరింది. గత మూడు రోజుల్లో వెండి ధర మొత్తం రూ.8,000 పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ధరలు భారీగా తగ్గి తిరిగి ఇలా పెరగడం మార్కెట్‌లో అస్థిరతను చూపిస్తోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అక్కడ బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను తాకుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 4,200 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. కేవలం ఒక్కరోజులోనే ఇది 100 డాలర్లు పెరిగింది. వెండి ధర కూడా ఔన్సుకు 53.38 డాలర్ల స్థాయికి చేరి రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. భారత రూపాయి ప్రస్తుతం అమెరికా డాలరుతో పోలిస్తే రూ.88.63 వద్ద ఉంది.
ఈ పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డిసెంబర్ సమీక్షలో మరలా తగ్గించే అవకాశం ఉండటంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. రెండవది, యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దశలో ఉండటంతో, 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. దీని ఫలితంగా ఫెడ్ మళ్లీ బాండ్ల కొనుగోళ్లు పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లలో చెలామణి అయ్యాయి. ఈ పరిణామాలు కలిపి బంగారం ధరలను మరింతగా ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ALSO READ: మరోసారి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు





