Union Budget Session: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జనవరి 28 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంత కంటే ఒక రోజు ముందు.. అంటే జనవరి 27న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉభయ సభలు సజావుగా సాగడం, చేపట్టాల్సిన కీలక బిల్లులు, ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించనుంది.
జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగం
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బడ్జెట్ సమావేశాల వివరాలను వెల్లడించారు. జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.జనవరి 31న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, సంప్రదాయం ప్రకారం నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతుంది. రెండో విడత మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. మధ్యలో ఉన్న విరామ సమయంలో పార్లమెంటరీ స్థాయి సంఘాలు వివిధ శాఖల కేటాయింపులపై లోతైన అధ్యయనం చేస్తాయి. “ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆలోచనాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తున్నాం” అని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.





