
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్ : మర్రిగూడ మండలం, మేటి చందాపురం (ఇందుర్తి) గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిన చెరుకు లింగం గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఐతగోని అశోక్ గౌడ్‌లను భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని, బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్వర్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని కేటీఆర్ హర్షించినట్లు వారు తెలిపారు. పార్టీకి నష్టం చేసే వారిపై, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం.
గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం.. బిఆర్ఎస్ పార్టీ తన క్రమశిక్షణ వైఖరిని మరింత కఠినంగా అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మేటిచందాపూర్ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థిగా ఏరుకొండ అబ్బయ్యను మునుగోడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యవహరించారన్న ఆరోపణలు చెరుకు లింగం గౌడ్, ఐతగోని అశోక్ గౌడ్‌లపై వచ్చాయి. ఈ చర్యలే చివరకు అభ్యర్థి ఓటమికి దారితీశాయన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమైంది.
ఈ పరిణామాలు గ్రామస్థాయిలో తీవ్ర అసంతృప్తికి దారి తీసాయి. పార్టీ పరువు, క్రమశిక్షణకు భంగం కలిగిందని భావించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ నెల 16న జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పార్టీ నిర్ణయాలను బేఖాతరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విస్తృతంగా చర్చించి, ఇరువురిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
గ్రామస్థాయి తీర్మానాన్ని నియోజకవర్గ ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, ఆయన ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కోణంలో సమీక్షించారు. పార్టీ నియమాలు అందరికీ సమానమేనని, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించడం తీవ్రమైన పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. పదవులు, హోదాలు ఏవైనా సరే, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చెరుకు లింగం గౌడ్, ఐతగోని అశోక్ గౌడ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ నిర్ణయం మేటిచందాపూర్ గ్రామ రాజకీయాలకే కాకుండా, మర్రిగూడ మండలం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణే కీలక ఆయుధమన్న స్పష్టమైన సంకేతాన్ని బిఆర్ఎస్ ఈ చర్య ద్వారా పంపిందన్న విశ్లేషణ వినిపిస్తోంది. గ్రామస్థాయి ఎన్నికలైనా, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ లేని వైఖరికి ఇది ప్రతీకగా నిలిచిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పోటీలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి ఏరుకొండ అబ్బయ్య, మాజీ ఎంపీటీసీ సరిత నాగేష్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.





